
- ఆమె మాటలకు సమాధానం చెప్పలేక కేటీఆర్ ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నడు
- కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టును కట్టిన్రు
- సీబీఐ ఎంక్వైరీతో కాళేశ్వరం అవినీతి మొత్తం బయటపడ్తది
- ఫార్ములా ఈ రేస్.. లొట్టపీసు కేసు అంటున్న కేటీఆర్.. విచారణకు ఎందుకు భయపడుతున్నడు?
- బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్లలో సాండ్ మాఫియా
- అడ్డొచ్చిన దళితులను హింసించిన్రు
- ఇసుక దందాపై కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడి
- సిరిసిల్లలో సకల జనుల సన్మానానికి హాజరు
రాజన్న సిరిసిల్ల, వెలుగు:
గత బీఆర్ఎస్ హయాంలో కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని రాష్ట్ర కార్మిక, భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని బయటపెట్టేందుకే సీబీఐ ఎంక్వైరీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని, ఈ విచారణలో అవినీతి మొత్తం బయటపడుతుందని తెలిపారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి కేసీఆర్ ఫ్యామిలీ రూ. కోట్లు దోచుకున్నది. ఈ విషయాన్ని కవిత కూడా బయటపెట్టారు. ముందు కేటీఆర్తన చెల్లె కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి” అని అన్నారు. చెల్లె మాటలకు సమాధానం చెప్పలేక కేటీఆర్ ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని విమర్శించారు.
బుధవారం (సెప్టెంబర్ 10) మంత్రి వివేక్ వెంకటస్వామి సిరిసిల్లలో జరిగిన సకల జనుల సన్మానానికి హాజరయ్యారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుంచి లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు.. మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ఫార్ములా కారు రేస్.. లొట్టపీసు కేసు అంటున్న కేటీఆర్.. విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే రూ. 34 వేల కోట్ల అంచనాతో ప్రాణహిత– చేవెళ్ల స్కీమ్‌ను చేపట్టారని, అందులో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. మరో 24 వేల కోట్లు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేదని తెలిపారు.
కమీషన్లు దండుకోవడానికే బీఆర్ఎస్ తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టును కాళేశ్వరం వద్దకు షిఫ్ట్ చేసిందని విమర్శించారు. హైదరాబాద్‌కు 20 టీఎంసీల నీటిని తీసుకెళ్లే కార్యక్రమానికి సీఎం శంకుస్థాపన చేశారని, అవి కాళేశ్వరం జలాలని కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఆయనకు ఇరిగేషన్‌పై అవగాహన లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌కు నీటిని తరలిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 20 టీఎంసీల నీరు సరిపోతుందని, మరి 50 టీఎంసీల కెపాసిటీతో మల్లన్నసాగర్‌ను ఎందుకు నిర్మించారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.
ప్రపంచంలోనే ఇంతపెద్ద రిజర్వాయర్‌ను ఎక్కడా కట్టలేదన్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌కు, కొండ పోచమ్మ సాగర్‌కు నీళ్లు తీసుకుపోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని చెప్పారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని గమనించిన ప్రజలు.. వారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. యువకుల బలిదానాలు చూసే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. సిరిసిల్లలో తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నవారి కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించామని తెలిపారు.
గతంలో విచ్చలవిడిగా ఇసుక మాఫియా
బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు సిరిసిల్లలో విచ్చలవిడిగా సాండ్ మాఫియా నడిచిందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇసుక మాఫియాను ఎదురించినందుకు దళితులను హింసించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక దందాపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సిరిసిల్లలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని, వచ్చే ఎన్నికల్లో కేకే మహేందర్‌రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తాను ఎక్కడికెళ్లినా.. తన తండ్రి వెంకటస్వామి చేసిన సేవలను ప్రజలు, నాయకులు గుర్తుచేస్తుంటారని, తాను ఆయన బాటలోనే నడుస్తానని వివేక్ చెప్పారు.
కాకా స్ఫూర్తితో తాను ప్రజలకు మేలు చేస్తానని చెప్పారు. సిరిసిల్లలో చేనేత కార్మికులను కాకా వెంకటస్వామి ఆదుకున్నారని ఇక్కడి నాయకులు చెప్తున్నారని, మున్ముందు సిరిసిల్ల కార్మికులకు అదే స్ఫూర్తితో అండగా నిలుస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్ర భుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, నాయకులు ఆకునూరి బాలరాజు, కత్తెర దేవదాస్, రమేశ్, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సంక్షేమం
గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చిందని, అయినా ప్రజలు బాగుండాలని తాము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్య శ్రీ స్కీం కింద రూ. 10 లక్షల వరకు వైద్యం ,రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నట్టు చెప్పారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)లో యువతకు స్కిల్ ట్రైనింగ్ఇస్తున్నామన్నారు. ఇప్పటికే యువతకు 60వేల ఉద్యోగాలు కల్పించామని, రాబోయే కాలంలో 2 లక్షల జాబ్స్ భర్తీ చేస్తామని తెలిపారు.