- ముందుకు సాగాలి
- దళితులు ఐక్యంగా ఉండాలి
- మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
జూబ్లీహిల్స్, వెలుగు: బౌద్ధ భిక్షువులు సమాజంలో శాంతి, సమానత్వం, మానవత్వం, సోదరభావం పెంపొందించేందుకు చేస్తున్న త్యాగం గొప్పదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. భగవాన్ బుద్ధుడు చూపిన ధమ్మ మార్గం మానవాళికి శాశ్వత మార్గదర్శకమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో ఆదివారం బౌద్ధ ధమ్మ దీక్షా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరయ్యారు. బౌద్ధ భిక్షువులతో కలిసి భగవాన్ బుద్ధుడు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మినిస్టర్ మాట్లాడుతూ అందరం కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలమని, దళిత సమాజం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దళితుల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. తమ తండ్రి కాకా వెంకటస్వామి దళితుల సేవ, ఐక్యత కోసం ఎంతో కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు. విద్య ద్వారానే సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. డొనేషన్ లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతోనే వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ విద్యాసంస్థల నుంచి పలువురు స్టూడెంట్లు న్యాయమూర్తులుగా ఎంపికయ్యారని చెప్పారు. లా కాలేజీకి ఇండియా టుడే సర్వేలో జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంక్ లభించిందని పేర్కొన్నారు.
ఉద్యోగ నియామకాల్లో అన్యాయంపై పోరాటం
ఉద్యోగ నియామకాల్లో దళితులకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరాటం చేస్తున్నామని వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ సమస్యలను క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి, రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ స్థాయిలో పోరాడుతున్నామని చెప్పారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో నైపుణ్య శిక్షణ పొందిన వారికి నెలకు రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు సంపాదించే అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.
జర్మన్, జపనీస్ భాషల్లో ఉచిత శిక్షణ అందించేందుకు తన సొంత ఖర్చులతో ట్యూటర్లను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం బౌద్ధ దమ్మ వేడుకల సందర్భంగా బంతే ఆర్య నాగార్జున సూర్య ససాయి చేతుల మీదుగా సుమారు 300 మంది బౌద్ధ ధమ్మ దీక్షను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సంస్థల డైరెక్టర్ బాలరాజు, బౌద్ధ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరందాములు, లతా రాజా ఫౌండేషన్ చైర్మన్ లతా రాజా, రిటైర్డ్ డీఎస్పీ దామెర నర్సయ్య, డాక్టర్ నరేన్, దూమర్ల నిరంజన్, డాక్టర్ అర్జున్, ఏ.డీ. మధు, దాసరి లక్ష్మయ్య, గడ్డం మద్దిలేటి, మేకల రవీందర్, మేకల శ్రీనివాస్, దుర్గం నగేష్, తల్లమల్ల శ్వేత, మసాడే లక్ష్మీనారాయణ, డాక్టర్ లక్ష్మీనారాయణ, మండల రాహుల్, కోల శ్యామ్ పాల్గొన్నారు.
