ఉద్యమం ముసుగులో  కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీ.. 400 ఎకరాల జాగా ఎక్కడిదో చెప్పాలె: మంత్రి వివేక్

ఉద్యమం ముసుగులో  కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీ.. 400 ఎకరాల జాగా ఎక్కడిదో చెప్పాలె: మంత్రి వివేక్
  • ప్రజలు సొంత డబ్బు ఖర్చు చేసుకుంటే.. వాళ్లు వేల కోట్ల ఆస్తులు సంపాదించిండ్రు
  •     400 ఎకరాల జాగా ఎక్కడిదో చెప్పాలె
  •     ఎలక్షన్ అఫిడవిట్లతో బీఆర్ఎస్ లీడర్ల బాగోతాలు బయటికొస్తున్నాయ్
  •     టూరిజం హబ్​గా చెన్నూరు అభివృద్ది
  •     గనులశాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి 

కోల్​బెల్ట్/మంచిర్యాల, వెలుగు: తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలు తమ సొంత డబ్బును ఖర్చు చేస్తే.. కేసీఆర్ ​కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులు  కూడబెట్టుకుందని మంత్రి వివేక్​ వెంకటస్వామి ధ్వజమెత్తారు. ఎన్నికల అఫిడవిట్లలో లేని 400 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్​ ఫ్యామిలీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, భీమారం, చెన్నూరు మండలాల్లో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ, 2014 ఎన్నికల సమయంలో ఇంచు భూమిలేదన్న బాల్క సుమన్​కు ఇప్పుడు భూములు, ఇండ్లు, వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

ఎన్నికల అఫిడవిట్లతో బీఆర్ఎస్ నేతల ఆస్తుల బాగోతాలు బయటపడుతున్నాయన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి  సింగరేణి లాభాలు, కార్మికుల వాటాను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుందన్నారు. మందమర్రి ఏరియా అభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసం ఆర్కేపీ ఓపెన్​కాస్ట్​ ఫేజ్​-2 మైన్​ తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. మందమర్రిలోని సింగరేణి స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్​ లో టామ్​కామ్​ ద్వారా ప్రస్తుతం 70 మంది యువత జర్మన్​ భాషపై శిక్షణ 
పొందుతున్నారన్నారు. 

అంతకుముందు మందమర్రి మండలం వెంకటాపూర్​లో రూ.2.97 కోట్లతో నిర్మించనున్న 33/11కేవీ విద్యుత్​ సబ్​ స్టేషన్​కు, మందమర్రి  పట్టణంలోని పలు వార్డుల్లో రూ.14.75 కోట్ల యూఐడీఎఫ్​ నిధులతో సీసీ రోడ్లు, డ్రయినేజీల నిర్మాణం,  చెన్నూరులోని ఏహెచ్​ఎస్​ స్కూల్​లో రూ.73లక్షల డీఎంఎఫ్​టీ, సీఎస్​ఆర్ నిధులతో అదనపు తరగతి గదులు, మేజర్, మైనర్​ రిపేర్లు, పెండింగ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. భీమారం మండలం దాంపూర్​ గ్రామంలో బాలవికాస్ నీటి శుద్ధీకరణ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి వెంట గిరిజన సంక్షేమ అధికారి సురేశ్, మంచిర్యాల విద్యుత్​ ఎస్​ఈ బానోత్​ రాజన్న, ఏసీపీ కిరణ్​కుమార్, మందమర్రి, చెన్నూరు మున్సిపల్​ కమిషనర్లు రాజలింగు, మారుతీప్రసాద్, చెన్నూరు మున్సిపల్​ చైర్​ పర్సన్​ పెద్దింటి పద్మ, వైస్​ చైర్మన్​ వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ ప్రసాద్, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్​రెడ్డి, సర్పంచులు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు. 

రూరల్​ ప్రాంత ప్రజల వందేండ్ల కల సాకారం..

మందమర్రి మండల ప్రజల విద్యుత్ సమస్యలను దూరం చేయడానికి వెంకటాపూర్​లో రూ.2.97 కోట్లతో కొత్తగా విద్యుత్​సబ్​స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివేక్​ తెలిపారు. ఎల్​ నినో ప్రభావంతో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. చెన్నూరులో 100 పడకల ఆస్పత్రిని త్వరలో ప్రారంభిస్తామని, మందమర్రిలో 50పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో హ్యామ్​ రోడ్లను నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని, రూ.4.85కోట్ల నిధులతో రసూల్​పల్లి నుంచి చిర్రకుంట వరకు 4.7 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు పర్మిషన్లు వచ్చాయమన్నారు. మందమర్రిని  అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రోల్​మెడల్​గా తీర్చిదిద్దుతానని మంత్రి అన్నారు.

బీఆర్​ఎస్​ హయాంలో  వార్డుల్లో అభివృద్ధి పట్టించుకోలేదని, తాను ఎమ్మెల్యే అయిన తర్వాత దీపక్​నగర్​లో రోడ్లు రిపేర్లు చేపట్టామని, యాపల్​ ఏరియాలో రూ.2.5కోట్లతో డ్రయినేజీ నిర్మించామని, పట్టణంలోని వార్డుల్లో రూ.14.75 కోట్లతో  సీసీరోడ్లు, డ్రయినేజీల నిర్మాణపనులు ప్రారంభించామన్నారు. మరో రూ.40కోట్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రూ.70 కోట్లతో గోదావరి పుష్కరాల పనులు కొనసాగుతున్నాయన్నారు. రూ.100కోట్ల అమృత్​స్కీం నిధులతో మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో ఇంటింటికి మంచినీరు అందించనున్నట్టు చెప్పారు.  గత నెల 28న  నస్పూర్​ గేట్​ వద్ద జరిగిన లారీ-ఆటో ప్రమాదంలో మందమర్రి మండలం వెంకటాపూర్​, గుడిపెల్లి, పోన్నారం గ్రామాలకు చెందిన ఆరుగురు మహిళలు మృతిచెందారు.  బుధవారం మృతుల కుటుంబాలను మంత్రి పరామర్శించారు. 

ఆర్టీసీ ఎన్నికల్లో టీడబ్ల్యూయూను గెలిపించాలి

ఆర్టీసీని త్వరలోనే ప్రభుత్వంలో విలీనం చేస్తామని.. ఈ ప్రక్రియ కాంగ్రెస్​తోనే సాధ్యమని మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఆర్టీసీ ఎన్నికల సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, ఆదిలాబాద్​ రీజియన్​ ఎలక్షన్​ ఇన్​చార్జి ఎస్​.వేణుగోపాలాచారి ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు బుధవారం మంచిర్యాలలోని మంత్రి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్​ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు తీర్చాలంటూ ఉద్యమం చేసినప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ అణచివేసే కుట్ర చేశారన్నారు. ఆర్టీసీ కార్మికులను సంస్థ నుంచి తొలగించి ప్రైవేట్ డ్రైవర్లను, కండక్టర్లను నియమించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని విమర్శించారు.

‘కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం పనిచేస్తుంది. అధికారంలోకి వచ్చాక రెండు డీఏలు ఇచ్చింది. మినిమం వేజెస్ బోర్డు ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో ఆర్టీసీ కార్మికులకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్​లో వైద్యం అందించేందుకు కృషి చేస్తాం. 20 శాతం హెచ్​ఆర్​ఏ, పీఆర్సీ కోసం చర్యలు తీసుకుంటాం. సింగరేణి సంస్థలో కార్మికులకు ఇస్తున్నట్టే ఆర్టీసీ కార్మికులకు సైతం ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తాం’ అని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నెల 9న జరగనున్న ఆర్టీసీ ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్​ యూనియన్​ (టీడబ్ల్యూయూ) బాణం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఐఎన్​టీయూసీ మద్దతుతో కార్మికుల సమస్యలు తీరుతాయన్నారు.