హైదరాబాద్ అంటేనే పెహల్వాన్ల అడ్డా అని.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఒక పెహల్వాన్ అని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంగళవారం ( మే 12 ) తెలంగాణ కేసరి 2026 పోటీల్లో గెలుపొందిన విజేతలను సన్మానించే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో హైదరాబాద్ కా పైచాన్… హైదరాబాద్ కా పెహల్వాన్ అనే నానుడి ఉండేదని. వారికి సరైన అవకాశాలు లభించక కుస్తీ వారి ప్రతిభను కనబరచలేక పోతున్నారని అన్నారు మంత్రి వివేక్.
నేడు కుస్తీ పోటీలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మాజీ ఎంపీ , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ కృషి చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నగరం అంటేనే పెహల్వాన్ల అడ్డ అని, అంజన్ కుమార్ యాదవ్ కూడా ఒక పెహల్వాన్ అని అన్నారు. వ్యాయామశాలలో వారు కసరత్తులు చేసేవారని , తన తండ్రి వెంకటస్వామి కూడా వ్యాయామశాలకు వెళ్ళేవారని అన్నారు మంత్రి వివేక్.
తెలంగాణ కేసరి 2026 పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి మంత్రి అభినందనలు తెలిపారు. వారు మరింత శిక్షణ తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో రెజ్లర్లుగా రాణించాలని ఆకాంక్షించారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
