
- కేసీఆర్, కేటీఆర్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలి
- పటాన్చెరులో నా ఫ్యాక్టరీని మూసివేయించినా నేను లొంగలే
- తమను ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతోనే ఫోన్లు ట్యాప్ చేయించారు
- కానీ ప్రజలంతా ఏకమై వాళ్లను గద్దె దించారన్న మంత్రి
ఆదిలాబాద్, వెలుగు: దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు, జీహెచ్ఎంసీ ఎన్నికల టైంలో నాలుగైదు సార్లు తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. అప్పట్లో తన ఫోన్‌ను ట్యాప్చేసిన ప్రతిసారీ ‘డేంజర్ అలర్ట్ స్టేట్ టెర్రరిజం’ అనే మెసేజ్ వచ్చేదని గుర్తు చేశారు. చట్ట ప్రకారం దేశానికి వ్యతిరేకంగా పనిచేసే టెర్రరిస్టుల ఫోన్లను తప్ప ఇతరుల ఫోన్లను ట్యాపింగ్ చేసే హక్కు ఎవరికీ లేదని, అమర్ సింగ్ కేసు తర్వాత కేంద్రం పార్లమెంట్ లో కఠిన చట్టం తీసుకొచ్చిందన్నారు. చీఫ్ సెక్రటరీ పర్మిషన్ లేకుండా ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయకూడదని.. కానీ, కేసీఆర్, కేటీఆర్ ఇష్టమొచ్చినట్టు వేల ఫోన్లు ట్యాపింగ్ చేయడం దుర్మార్గమన్నారు.
తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతోనే ఈ చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ అహంకారంతోనే గతంలో వీ6 వెలుగు మీడియా సంస్థను బ్యాన్‌చేసి ఇబ్బంది పెట్టారని గుర్తుచేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి వివేక్.. మీడియా వద్ద ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారు. మునుగోడు ఎన్నికల టైంలో పటాన్ చెరులోని తన ఫ్యాక్టరీకి నోటీసు ఇచ్చి మూసివేయించినప్పటికీ నేను ఎవరికి లొంగలేదన్నారు. ‘‘ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్చేసిన్రు.. కానీ, ప్రజలంతా ఏకమై, కేసీఆర్ ను గద్దెదించారు..’’ అని మంత్రి చెప్పారు.
ఇంతమంది ఫోన్లు ట్యాప్చేయించిన కేసీఆర్, కేటీఆర్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన అన్నారు. తనకు నోటీసులు ఇస్తే నిరభ్యంతరంగా విచారణకు వెళ్తానని చెప్పారు. 119 నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలే రాజులని, ఎంతో కష్టపడి గెలిచి పార్టీని నిలబెట్టారన్నారు. నేను మంత్రిని అయినప్పటికీ అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.