
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను.. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆయన తనయుడు, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఖర్గేకు పుష్పగుచ్ఛం అందజేసి, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉన్నత పదవుల్లో కొనసాగాలని ఆకాంక్షించారు. నాయకత్వ విలువలలో నిలకడగా, దశాబ్దాల రాజకీయ అనుభవంతో దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఖర్గేకు శుభాకాంక్షలు తెలుపుతూ, కాకాతో వారికి ఉన్న అనుబంధాన్ని మంత్రి వివేక్ వెంకట స్వామి గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీ, దేశ రాజకీయాలపై ఖర్గేతో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ చర్చించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా మల్లిఖార్జున్ ఖర్గేను నేరుగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకకు చెందిన మల్లిఖార్జున్ ఖర్గే 27 యేళ్ళ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1972లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.10 సార్లు శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించిన ఆయన... 2009 నుంచి 2019 వరకూ లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. AICC అధ్యక్ష పదవికి పోటీ చేసే ముందు ఆయన రాజ్యసభలో విపక్షనేతగా ఉన్నారు.