
- రూ.12 కోట్ల నిధులతో త్వరలో అభివృద్ధి పనులు
- మంత్రి వివేక్ వెంకటస్వామి
జూబ్లీహిల్స్, వెలుగు: కాంగ్రెస్ అంటేనే పేద ప్రజల పార్టీ అని, నాయకులందరూ నిత్యం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జూబ్లీహిల్స్
నియోజకవర్గంలోని రెహమత్నగర్ డివిజన్లో శనివారం జరిగిన బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి డివిజన్ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెహమత్నగర్ డివిజన్లో త్వరలో రూ.12 కోట్ల నిధులతో డ్రైనేజీ, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.
హైటెన్షన్ తీగల వల్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ఆర్టీసీ బస్సు సౌకర్యం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చించి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, కమలానగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందజేస్తామని వెల్లడించారు. కార్యకర్తలు ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒక్కో బూత్ కమిటీకి 20 మంది ముఖ్య నాయకులను నియమించి పార్టీ బలోపేతానికి ముందడుగు వేయాలని సూచించారు. రహమత్నగర్ అభివృద్ధికి నెలరోజుల్లో శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు.