వర్షాలకే కాళేశ్వరం కుంగడం విడ్డూరం : మంత్రి వివేక్

వర్షాలకే కాళేశ్వరం కుంగడం విడ్డూరం : మంత్రి వివేక్
  • కమీషన్ల కోసమే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ ఈ ప్రాజెక్టు కట్టింది: మంత్రి వివేక్
  • అవసరం లేకపోయినా ప్రాజెక్టులు కట్టి.. జనం సొమ్మును దండుకున్నరని ఫైర్‌‌‌‌‌‌‌‌
  • కాళేశ్వరం బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌తో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చామని వెల్లడి
  • చెన్నూరు నియోజకవర్గంలో పనుల జాతర కార్యక్రమం ప్రారంభం

కోల్​బెల్ట్ /చెన్నూరు/కోటపల్లి,​ వెలుగు: భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిందని మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు హైకోర్టులో కేసు వేయడం విడ్డూరంగా ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టు క్వాలిటీ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ లీడర్లపైనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లో పర్యటించిన ఆయన.. కలెక్టర్ కుమార్ దీపక్‌‌‌‌తో కలిసి ‘పనుల జాతర’కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

కొటపల్లి, చెన్నూరు మండలాల్లోని దేవులవాడ, రాంపూర్, సుందరశాల గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు మునిగిపోయిన పంటలను పరిశీలించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌‌‌‌‌‌‌‌తో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం, కరకట్టల నిర్మాణం గురించి ఇరిగేషన్‌‌‌‌ మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్ రెడ్డితో ఫోన్‌‌‌‌లో మాట్లాడారు. అనంతరం మందమర్రిలో మీడియాతో వివేక్‌‌‌‌ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును బాంబులతో కూల్చారని బీఆర్ఎస్ లీడర్ ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రవీణ్ కుమార్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన మరో పార్టీలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిందని, కేసీఆర్, హరీశ్ రావు, ఆర్ఎస్.ప్రవీణ్‌‌‌‌​కుమార్‌‌‌‌‌‌‌‌లో ఎవరి మాట నిజమో వారే తేల్చుకోవాలన్నారు. 

యూరియా కొరత సృష్టిస్తున్నది బీఆర్ఎస్సే.. 

రాష్ట్రంలోని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు పరిమితికి మించి యూరియాను కొనుగోలు చేసి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని వివేక్ వెంకటస్వామి అన్నారు. యూరియా కోసం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ లీడర్లు గల్లీల్లో కాదు.. ఢిల్లీలో ధర్నాలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడుతోందన్నారు. తెలంగాణకు 7లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటి వరకు సగం కూడా సప్లయ్‌‌‌‌ చేయలేదని మండిపడ్డారు.

 రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటా గురించి కాంగ్రెస్ ఎంపీలు కొట్లాడుతున్నారని, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వం, సంబంధిత మంత్రిపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న రాహుల్ గాంధీని స్ఫూర్తిగా తీసుకొని, ఇక్కడ కూడా ఆందోళన చేస్తామని చెప్పారు. కాగా, గత పదేండ్ల పాలనలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వలేదని, అయితే, కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఐదేండ్లలో 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టాలని నిర్ణయించిందని వెల్లడించారు.

ప్రాజెక్టులు కట్టి.. కమీషన్లు దండుకొని..

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకుని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని వివేక్ మండిపడ్డారు. అవసరం లేకపోయినా రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు కట్టి కమీషన్లు దండుకుందన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారన్నారు. ఈ ప్రాజెక్టుతో కేసీఆర్ కుటుంబం, కాంట్రాక్టర్లు ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌‌‌‌‌‌‌‌తో చెన్నూరు, కోటపల్లి, జైపూర్ మండలాల్లోని బబ్బెరచెలక, సుందరశాల, దేవులవాడ, రాంపూర్​, వెంచపల్లి, ఫౌనూర్, వేలాల ప్రాంతాల్లో వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందన్నారు. 

ఐదేండ్లుగా రైతులు ఇబ్బందులు పడ్డారని, వారికి పరిహారం ఇవ్వాలని గతంలో తాను ధర్నా చేసినా.. బీఆర్ఎస్ సర్కారు స్పందించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇప్పించినట్టు గుర్తుచేశారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీటి మునిగిన పంటలకూ పరిహారం అందిస్తామన్నారు.