ఓట్ల చోరీపై కొట్లాడాలి..ప్రజలంతా మాతో కలిసి రావాలి: మంత్రి వివేక్

ఓట్ల చోరీపై కొట్లాడాలి..ప్రజలంతా మాతో కలిసి రావాలి: మంత్రి వివేక్
  • 42% బీసీ రిజర్వేషన్లకు బీజేపీ, బీఆర్‌‌ఎస్‌‌ వ్యతిరేకం
  • ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం

కోల్‌‌బెల్ట్‌‌/చెన్నూరు/గోదావరిఖని, ​వెలుగు: ఓటు హక్కు.. దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని, కానీ.. బీజేపీ ప్రభుత్వం ఆ ఓట్లను చోరీ చేస్తున్నదని మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి ఆరోపించారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలు తమతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏరియాలో ఓటు చోరీపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి వివేక్ హాజరై ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ప్రారంభించారు. 

అనంతరం రామకృష్ణాపూర్, జైపూర్, చెన్నూరులోని మినిస్టర్ క్యాంప్ ఆఫీసుల్లో భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాల్లో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్‌‌ మాట్లాడారు. ‘‘ఓటు చోరీకి వ్యతిరేకంగా కేంద్రంపై రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు సంతకాల సేకరణ ప్రారంభించినం. ఈసీతో బీజేపీ కుమక్కై కాంగ్రెస్​కు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నది. వారికి అవసరమైన చోట ఓటర్లను నమోదు చేసుకుంటున్నది’’అని మంత్రి వివేక్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఫస్ట్ టైమ్ చెన్నూరు సెగ్మెంట్​లో ఓట్ల చోరీ అంశంపై అవగాహన కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు.

 ‘‘రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తొలగించే శక్తి ఎవరికీ లేదు. ఈవీఎంల ద్వారా ఓటేశాక తప్పనిసరిగా స్లిప్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నం. ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపడ్తున్నం’’ అని వివేక్ తెలిపారు. రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ, బీఆర్‌‌ఎస్‌‌ వ్యతిరేకమని మండిపడ్డారు. సీజేఐ జస్టిస్ గవాయ్​పై చెప్పు విసిరేందుకు ప్రయత్నించిన ఘటనతో దేశంలో కులవివక్షత ఉందని నిర్ధారణ అయిందన్నారు.

కొత్త బొగ్గు గనులు తీసుకొస్తం

పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్... సింగరేణిలో ఒక్క కొత్త గనిని తీసుకురాలేదని మంత్రి వివేక్ మండిపడ్డారు. ‘‘బొగ్గు గనుల కేటాయింపు కోసం కేంద్రం అమలు చేస్తున్న వేలంలో సింగరేణి పాల్గొనకుండా బీఆర్ఎస్ అడ్డుకున్నది. కొత్త బొగ్గు గనుల తవ్వకాలతోనే ఉద్యోగాలు లభిస్తాయని, ఈ ప్రాంతం డెవలప్ అయితదని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించిన. త్వరలో సింగరేణి సంస్థ వేలంలో పాల్గొంటది. ఇసుక దందా కారణంగానే బాల్క సుమన్​ను ప్రజలు ఓడించారు. నేను పది రోజులే ప్రచారంలో పాల్గొని గెలిచిన’’అని మంత్రి వివేక్ అన్నారు. చెన్నూరు సెగ్మెంట్​లోని పట్టణాలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైయినేజీలను నిర్మించామని తెలిపారు.  

బాధిత కుటుంబాలకు పరామర్శ

మందమర్రి మండలం కోటేశ్వర్​రావుపల్లికి చెందిన మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ లీడర్లు బొలిశెట్టి కనకయ్య.. సువర్ణ కుటుంబాన్ని మంత్రి వివేక్ పరామర్శించారు. ఇటీవల కనకయ్య తండ్రి చంద్రయ్య అనారోగ్యంతో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి.. బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. చంద్రయ్య ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.

జూబ్లీహిల్స్​లో మేమే గెలుస్తం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ 15% ఓట్ల మెజార్జీతో గెలుస్తదని మంత్రి వివేక్ ధీమా వ్యక్తం చేశారు. మందమర్రికి వెళ్తూ మార్గమధ్యలో గోదావరిఖనిలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడారు. ‘‘నేను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్​చార్జ్​గా బాధ్యతలు చేపట్టాక గతంలో ఉన్న 21 శాతం ఓటు బ్యాంకును 45 శాతానికి తీసుకొచ్చిన. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. జూబ్లీహిల్స్​ను పట్టించుకోలేదు. కాకా వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తూ పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రజాసేవలో ముందుకెళ్తున్నరు’’ అని మంత్రి వివేక్ అన్నారు.