
- మేం ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నం
- అక్రమ మైనింగ్‌కు పాల్పడితే ఎవరినీ వదిలిపెట్టం
- కాళేశ్వరంతో చెన్నూరుకు బొట్టు నీళ్లు రాలె
- ప్రాజెక్టు కట్టి లక్ష కోట్లు వృథా చేశారని ఫైర్
కోల్‌బెల్ట్/చెన్నూరు/కోటపల్లి, వెలుగు:బీఆర్ఎస్ హయాంలో ఇసుక రాయల్టీ ఏటా రూ.2,400 కోట్లు దోచుకున్నారని మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఆ పార్టీ లీడర్లే ఇసుక దందా చేసి, ప్రభుత్వ సొమ్మును దారిమళ్లించారని ఫైర్ అయ్యారు. ఆదివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి మండలాల్లో మంత్రి వివేక్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నదని కొందరు ప్రతిపక్ష నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేసేటోళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
ఆన్‌లైన్ ద్వారానే ఇసుక సప్లై చేస్తున్నామని చెప్పారు. ‘‘నేను మైనింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇసుక దందాపై ఉక్కుపాదం మోపాను. ఎక్కడా ఇసుక మాఫియా లేకుండా చర్యలు తీసుకుంటున్నాను. అక్రమ మైనింగ్‌కి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదు’’ అని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక ఫ్రీగా ఇస్తున్నామని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ నేతలు కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, ప్రజల సొమ్ము వృథా చేశారు.
ఈ ప్రాజెక్టు వల్ల చెన్నూరు నియోజకవర్గానికి ఒక్క బొట్టు నీళ్లు రాలేదు. కానీ బ్యాక్వాటర్వల్ల 40 వేల ఎకరాలు మునిగి రైతులు నష్టపోయారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేండ్లకే కూలిపోయింది. ఈసారి ప్రాజెక్టు నీళ్లు లేకున్నా 70 శాతం అధికంగా పంటలు పండినయ్” అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన రూ.లక్ష కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ డబుల్బెడ్రూమ్ఇండ్లు కట్టించే చాన్స్ ఉండేదన్నారు.
చెన్నూరులో రూ.500 కోట్ల పనులు..
చెన్నూరు నియోజకవర్గంలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి వివేక్ తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని చెప్పారు. చెన్నూరును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ‘‘నియోజకవర్గంలో 12 వేల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంచినీళ్లకు ఇబ్బందులు లేకుండా బోర్ వెల్స్ వేయిస్తాం. సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మిస్తున్నాం. కోటపల్లి మండలానికి డీఎంఎఫ్‌టీ నిధులు భారీగా కేటాయించాం. మారుమూల మండలమైన కోటపల్లి అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతాను.
ఇది అటవీప్రాంతం కావడం వల్ల రోడ్లు, అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతున్నది. రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్‌ను ఆదేశించాను. పోడు భూముల సమస్యపై డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి, ఫారెస్ట్ అధికారులతో చర్చించాను. ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న వాళ్లను ఇబ్బంది పెట్టవద్దని కలెక్టర్, అటవీ అధికారులను ఆదేశించాను” అని చెప్పారు. చెన్నూరు పట్టణ ప్రజలకు డ్రింకింగ్వాటర్కోసం రూ.30 కోట్లతో అమృత్‌స్కీమ్ పనులు నడుస్తున్నాయని, గోదావరి నది నుంచి నీళ్ల సప్లయ్ కోసం మరో స్కీమ్ తీసుకొస్తామని తెలిపారు.
వివిధ కార్యక్రమాలకు హాజరు..
మంత్రి హోదాలో మొదటిసారి కోటపల్లి మండల కేంద్రానికి వచ్చిన వివేక్‌వెంకటస్వామికి మండల ప్రజలు, కాంగ్రెస్శ్రేణులు ఘన స్వాగతం పలికారు. చెన్నూరు పట్టణంలోని మధున పోచమ్మ టెంపుల్‌లో మంత్రి వివేక్ ప్రత్యేక పూజలు చేశారు. తొలి ఏకాదశి రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. అనంతరం చెన్నూరులోని దర్గాలో ప్రార్థనలు చేశారు.
కోటపల్లిలో సివిల్సప్లయ్గోదాంలో, చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్అందజేశారు. కోటపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.5 లక్షల ఫండ్స్‌తో ఏర్పాటు చేసిన ఆర్వోఆర్వాటర్ప్లాంట్ను ప్రారంభించారు. వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్, డీఆర్డీవో కిషన్, ఆర్టీసీ ఆర్ఎం భవానీ ప్రసాద్, మంచిర్యాల డిపో మేనేజర్శ్రీనివాసులు, చెన్నూరు మున్సిపల్ కమిషనర్మురళీకృష్ణ, -మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ఏసీపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
గని కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తా:మంత్రి వివేక్ హామీ
గోదావరిఖని, వెలుగు: గని కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని, సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి కార్మికుల సొంతింటి కల నెరవేర్చేలా చూస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆదివారం గోదావరిఖనికి వచ్చిన ఆయనకు గోదావరి బ్రిడ్జి వద్ద గజమాల వేసి.. ఆయా సంఘాల నేతలు, కార్మికులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా కాకా వెంకటస్వామి, అంబేద్కర్ విగ్రహాలకు మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆర్కే గార్డెన్ వరకూ అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఆర్కే గార్డెన్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి వివేక్ ను మాలమహానాడు, యాదవ, గౌడ సంఘాలు, సింగరేణి ఏఐటీయూసీ, సీపీఐ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ, ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం, ఇతర సంఘాల నేతలు ఘనంగా సత్కరించారు. ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, మాలమహానాడు లీడర్ గుమ్మడి కుమారస్వామి, ఐఎన్టీయూసీ నేషనల్ సెక్రటరీ బాబర్ సలీం పాషా, నేతలు వంగ లక్ష్మీపతి గౌడ్, బాలసాని స్వామిగౌడ్, సదానందం యాదవ్, గాజుల లక్ష్మీ రాయమల్లు, గోవర్ధన్‌రెడ్డి, భిక్షపతి, బాపయ్య, వెంకటి, మల్లేశ్, కోటేశ్వర్లు, కామ విజయ్, మల్లికార్జున్ గౌడ్, మల్లేష్ యాదవ్, జీన్స్ శ్రీనివాస్, సజ్జద్, తిరుపతి, సంజీవ్, దీపక్, జావేద్, మధు, నరేందర్ రెడ్డి, ఫసియోద్దీన్, రమేశ్‌గౌడ్, వైవీ రావు, ఎల్లాగౌడ్, ఆరెల్లి పోషం, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.