- ఆర్కేపీ ఓసీపీ రెండో ఫేజ్ మైన్, ఎస్టీపీపీ విస్తరణతో ఉపాధి: మంత్రి వివేక్ వెంకటస్వామి
- జర్మనీ భాష నేర్చుకుంటే ఉపాధి కల్పించే బాధ్యత నాదే
- యూరియా కొరత లేదు.. రైతులు ఆందోళన చెందవద్దు
- మందమర్రికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు
కోల్‌బెల్ట్, వెలుగు: గతంలో సింగరేణికి కొత్త బొగ్గు గనులు రాకుండా అడ్డుకున్నది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. బొగ్గు బ్లాక్‌ల కేటాయింపు కోసం కేంద్రం నిర్వహించిన టెండర్లలో సింగరేణి పాల్గొనేందుకు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. తాను సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి టెండర్లో పాల్గొనేలా సింగరేణికి పర్మిషన్ ఇప్పించినట్టు చెప్పారు.
సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాల్లో మంత్రి పర్యటించారు. మందమర్రిలో టామ్‌కామ్ ఆధ్వర్యంలో జర్మన్ భాష శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన వెంట కలెక్టర్ కుమార్ దీపక్, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ ఉన్నారు. అనంతరం మందమర్రి ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.
జైపూర్లో సీఎస్ఆర్ నిధులతో నిర్మించే మల్టీ పర్ఫస్ కమ్యూనిటీ హాల్‌కు, కోటపల్లి మండలం పారిపెల్లిలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. భీమారం మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్లో రూ.66 లక్షలతో నిర్మించిన డార్మెటరీ గదులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ విస్తరణలో భాగంగా కొత్తగా రెండోఫేజ్ మైన్ మంజూరైందని, ఫారెస్ట్ క్లియరెన్స్ ప్రక్రియ తుదిదశలో ఉందని, త్వరలోనే మైన్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. జైపూర్లో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 850మెగావాట్ల మూడో యూనిట్ రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందన్నారు. కొత్తగని, పవర్ ప్లాంట్ ద్వారా కొత్తగా 10వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
విదేశాల్లో ఉద్యోగాలకు కరువు లేదు
జర్మనీ భాష నేర్చుకున్న యువతకు ఉపాధి కల్పించే బాధ్యత తానే తీసుకుంటానని మంత్రి చెప్పారు. స్కిల్స్, భాషపై పట్టు ఉంటే విదేశాల్లో ఉద్యోగాలకు కరవు లేదన్నారు. సింగరేణి ప్రాంతంలో మొదటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను మందమర్రిలో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం జర్మన్ భాషను ఇష్టంగా నేర్చుకోవాలన్నారు. విదేశాలలో అక్కడి నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు.
జర్మనీలో వారానికి 32 నుంచి 35 గంటల పని మాత్రమే ఉంటుందని, మిగతా టైమ్‌లో ఇతర నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. జర్మనీ నేర్చుకుంటున్న వారిలో 80శాతం హాజరు ఉంటే కాకా వెంకటస్వామి ట్రస్ట్ ద్వారా రూ.1000 స్టైపెండ్ ఇస్తానని ఇంతకు ముందు హామీ ఇచ్చానని,పాస్అయిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. ఉద్యోగాలు సాధించినవారు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, మరింత మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలన్నారు.
రైతులకు యూరియా కొరత లేదు
రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత లేదని... కేవలం కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీలోనే ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకున్నా బీఆర్ఎస్ లీడర్లు రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేయించారన్నారు. బీఆర్ఎస్ నేతలు ఉసిగొల్పిన రైతులు ఎవ్వరూ కూడా ధర్నాల్లో పాల్గొనలేదని స్వయాన వాళ్లే ఒప్పుకున్నారని గుర్తు చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడ కూడా రైతులు ఇబ్బందులు పడలేదని, చివరి గింజ వరకు పూర్తిస్థాయిలో కొనుగోళ్లు చేశామన్నారు. ఈ ప్రక్రియలో కొనుగోలు కేంద్రాల నిర్వహణ, లారీలు, హమాలీల సమస్యల పరిష్కారం అంశాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ సాగుకు అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని, రైతులు అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు.
యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయాలని, అవసరం మేరకు మాత్రమే రైతులు యూరియా కొనుగోలు చేయాలని సూచించారు. జూన్ 30న రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తామని రైతులకు శుభవార్త చెప్పారు. కార్యక్రమంలో బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు కిరణ్‌కుమార్, వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు సతీశ్, వనజారెడ్డి, సదానందం, మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాజలింగు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జర్నలిస్టులకు ఇండ్లు, స్థలాలు
రాష్ట్రంలో అర్హత ఉన్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇస్తున్నట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మందమర్రి ప్రెస్‌క్లబ్ ప్రెసిడెంట్ జి.చందర్, జనరల్ సెక్రటరీ సలామొద్దీన్, కోశాధికారి శంకర్, గౌరవ అధ్యక్షుడు బావండ్లపెల్లి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి శ్రీధర్, గౌరవ సలహాదారు రహమాత్ఖాన్ తదితరులను మంత్రి సన్మానించారు. అనంతరం క్లబ్ సభ్యులు మంత్రిని సన్మానించారు. ప్రెస్‌క్లబ్ అభివృద్దికి రూ.లక్ష ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. స్థానిక జర్నలిస్టులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. అర్హత ఉన్న జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
మందమర్రికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరైందని, ఇప్పటికే రూ.200 కోట్లతో చెన్నూరు మండలం సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణపనులు సాగుతున్నాయన్నారు. చెన్నూరులోని డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో 3.50 కోట్లతో పూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. చెన్నూరులో 100 పడకల ఆసుపత్రిని జులై 15న ప్రారంభించాలని నిర్ణయించినట్టు చెప్పారు. మందమర్రిలో గతంలో ఉన్న 50 పడకల ఆసుపత్రిని తిరిగి ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆఫీసర్లను ఆదేశించారు.
