క్రీడలకు పెద్దపీట..ఫోర్త్ సిటీలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం: మంత్రి వివేక్ వెంకటస్వామి

క్రీడలకు పెద్దపీట..ఫోర్త్ సిటీలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం: మంత్రి వివేక్ వెంకటస్వామి

ప్రఖ్యాత భారత క్రికెటర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సయీద్ కిర్మాణీ ఆత్మకథ ‘STUMPED’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం (ఆగస్టు 10) సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. 

తాజ్ డెక్కన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్, టీమ్ ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌తో పాటు పలు క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.

మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ..1983 వరల్డ్ కప్ విజయం తనకు ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకమని, చిన్నప్పుడు ఎల్బీ స్టేడియంలోనే క్రికెట్ నేర్చుకున్నానని అన్నారు. హైదరాబాద్ నుంచి భారత క్రికెట్‌లో మహ్మద్ సిరాజ్ ఒక గొప్ప ఐకాన్‌గా నిలిచారని ఆయన ప్రశంసించారు.

క్రీడల అభివృద్ధికి ప్రతిష్టాత్మక ప్రణాళికలు

ఫోర్త్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ పాలసీని త్వరలోనే ప్రవేశపెట్టనున్నారని అన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయడం సీఎం లక్ష్యం అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.

క్రికెట్‌లో అపార సేవలందించిన సయీద్ కిర్మాణీ జీవితంలోని విశేషాలను, అనుభవాలను ‘STUMPED’ పుస్తకం లో ఆవిష్కరించారు. ఈ పుస్తక ఆవిష్కరణకు హాజరైన అతిథులు కిర్మాణీ కృషిని, క్రీడాస్ఫూర్తిని కొనియాడారు.