అందుబాటులోకి గోదావరి ఇసుక..కొల్లూరులో రీచ్ను ప్రారంభించిన మంత్రి వివేక్

అందుబాటులోకి గోదావరి ఇసుక..కొల్లూరులో రీచ్ను ప్రారంభించిన మంత్రి వివేక్
  •  
  • చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు తీరిన సాండ్ కష్టాలు
  • అన్ లైన్ బుకింగ్ ద్వారా తక్కువ ధరకే సప్లై రూ.1,850 కే ట్రాక్టర్

చెన్నూర్, వెలుగు:  చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు గోదావరి ఇసుక అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు ఇసుక కోసం ప్రజలు పడుతున్న కష్టాలు తీరిపోయాయి. ఇందిరమ్మ ఇండ్లు, భవన నిర్మాణాలు, ఇతర పనులకు నాణ్యమైన ఇసుక దొరకక, అధిక ధరల భారంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కోటపల్లి మండం కొల్లూరులో ఇసుక రీచ్​ప్రారంభించడంతో తక్కువ ధరకే నాణ్యమైన ఇసుక లభిస్తోంది. టీజీఎండీసీ ద్వారా ఆన్​లైన్​లో బుకింగ్ చేసుకుంటే చాలు వెంటనే ఇసుక ట్రాక్టర్ ఇంటికి వస్తుంది. దీంతో చెన్నూర్, కోటపల్లి మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రీచ్ ను ప్రారంభించిన మంత్రి

గోదావరి నది పక్కనే ఉన్నప్పటికీ చెన్నూరు, కోటపల్లి మండలాల ప్రజలు ఇసుక కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీంతో నాణ్యమైన గోదావరి ఇసుకను సప్లై చేయాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి రావడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. 

మొదట రెండు నెలల క్రితం చెన్నూరులో సాండ్ బజార్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇసుక రేటు ఎక్కువగా ఉందని ప్రజలు విజ్ఞప్తి చేయడంతో కొల్లూరు గోదావరిలోనే ఇసుక రీచ్​ను ఏర్పాటు చేయించారు. రెండ్రోజుల క్రితం కలెక్టర్ కుమార్ దీపక్​తో కలిసి రీచ్​ను ప్రారంభించారు.

టన్ను రూ.600కే

మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో గోదావరి ఇసుక తక్కువ ధరకే లభిస్తోంది. ఆన్​లైన్​లో టీజీఎంసీ ద్వారా బుకింగ్ చేసుకుంటే రూ.1,850కి ట్రాక్టర్ ఇసుకను చెన్నూరుకు సప్లై చేస్తున్నారు. టన్నుకు రూ.600తో  అందిస్తున్నారు. గతంలో స్థానిక అవసరాల కోసం చెన్నూరు బతుకమ్మ వాగులో మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో రీచ్ నిర్వహించారు. చెన్నూర్ ప్రజలకు ఇసుక అవసరమైతే బతుకమ్మ వాగు నుంచే తెచ్చుకునేవారు. 

ఆ ఇసుక క్వాలిటీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గోదావరి ఇసుక దొంగ చాటుగా అమ్ముకునేవాళ్లు రూ.3 వేల నుంచి 
రూ.4వేలకు ట్రిప్పు కొట్టేవారు. ప్రస్తుతం రూ.1,850కి గోదావరి ఇసుక దొరుకుతుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోటపల్లి మండలం వాసులకు సైతం గోదావరి ఇసుక అందుబాటులోకి వచ్చింది. అయితే దూరాన్ని బట్టి రవాణా చార్జీలు భరించాల్సి ఉంటుంది.

సంతోషంగా ఉంది 

కోటపల్లి మండలంలో ఇసుక మాఫియా పూర్తిగా అంతమైంది. ఇసుక మాఫియాను అంతం చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి ఇచ్చిన మాట ప్రకారం రీచ్​ ఏర్పాటు చేయడం ద్వారా అక్రమ దందాను అరికట్టారు. గృహ నిర్మాణాల కోసం తక్కువ ధరలకు ఇసుకను అందించడంతో మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. - ఆలూరి సంపత్, సర్పంచ్, కోటపల్లి 

ఇసుక కష్టాలు తీరాయి

గత కొన్ని రోజులుగా మా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక దొరకక మా గ్రామంలో నిర్మాణాలు ఆగిపోయాయి. చెన్నూరులో సాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లు కొల్లూరులో ఏర్పాటుచేయాలని మంత్రి వివేక్ ను కోరాము. స్పందించిన మంత్రి కొల్లూరులో ఇటీవల ఇసుక రీచ్ ను ఏర్పాటు చేసి, తక్కువ ధరకే గోదావరి ఇసుక అందేలా చేశారు. దీంతో మాకు ఇసుక కష్టాయి తీరాయి. మంత్రి వివేక్ వెంకటస్వామికి ధన్యవాదాలు.  ఆసరెల్లి తిరుపతి, దేవులవాడ, కోటపల్లి మండలం