
టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. నార్సింగిలోని ఆయన నివాసంలో మహేష్ గౌడ్ తో సమావేశమయ్యారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి పీసీసీ చీఫ్ ను మర్యాదకపూర్వకంగా కలిశారు వివేక్ వెంకటస్వామి. అనంతరం ఇద్దరు నేతలు బ్రేక్ ఫాస్ట్ చేశారు.
ఈ సందర్బంగా త్వరలో జూబ్లీహిల్స్ జరగబోయే ఉప ఎన్నిక పై ఇద్దరు చర్చించారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల బలాబలాలు, ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ఆమోదించడం అనంతరం ప్రజల్లో దాని ప్రభావం గురించి పార్టీ పరంగా ఈ విషయంలో అనుసరించాల్సిన విషయం గురించి చర్చించారు.
ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. మాగంటి మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ పోటీ చేసేందుకు అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి తీవ్ర పోటీ నెలకొనగా.. ఎలాగైనా సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని బీఆర్ఎస్ చూస్తోంది. మరో వైపు పాగా వేయాలని బీజేపీ చూస్తోంది.