అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం న్యాయమేనని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజ్‌భవన్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. అజారుద్దీన్‌పై ఉన్న కేసులు రుజువు కాలేదని, ఆయనకు మంత్రి పదవి విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావాలనే రాజకీయం చేస్తున్నారని వివేక్ మండిపడ్డారు. కేటీఆర్ కూడా తీవ్రమైన అసహనంలో ఏవేవో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. ఆరు నెలల్లోగా అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవిలో ఉంటారని చెప్పారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఆయన పేరును సిఫారసు చేస్తే అడ్డుకున్నదే బీఆర్‌ఎస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగింది. మహమూద్ అలీకి మంత్రి పదవి ఇచ్చి హోమ్, రెవెన్యూ శాఖలు అప్పజెప్పినా.. ఆయనకు పవర్ మాత్రం లేకుండా చేశారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉండి జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. మా ప్రభుత్వం వచ్చినంకనే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం” అని తెలిపారు. తాను స్వయంగా పలు బస్తీల్లో పర్యటించి.. పేదల సమస్యలను తెలుసుకొని, అప్పటికప్పుడు పరిష్కరించానని చెప్పారు.
