పదేండ్లలో రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి

పదేండ్లలో రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • పదేండ్లలో రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు
  • ఆ పార్టీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్లే: మంత్రి వివేక్
  • కాంగ్రెస్ సర్కార్ మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తున్నది
  • ముస్లిం నేతకు మంత్రి పదవి ఇచ్చే సంప్రదాయం 
  • ఎప్పటి నుంచో ఉన్నది  షేక్​పేటలో మైనారిటీ నేతలతో సమావేశం


జూబ్లీహిల్స్/కోల్​బెల్ట్, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. బీఆర్ఎస్​కు ఓటేస్తే.. బీజేపీకి వేసినట్లే అని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్​తో కలిసి షేక్​పేటలోని పారా మౌంట్ కాలనీలో మైనారిటీ నేతలతో మంత్రి వివేక్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘జూబ్లీహిల్స్​లోని చాలా మంది మైనారిటీ నేతలు మా నాన్న కాకా వెంకటస్వామితో కలిసి పని చేశారు. 

మా ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. 17 మంది మైనారిటీ నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినం. ముస్లిం నేతకు మంత్రి పదవి ఇచ్చే సంప్రదాయం కాంగ్రెస్​లో ఉంది. పార్టీలో ఎవరూ మైనారిటీ ఎమ్మెల్యే లేకపోవడంతో సాధ్యపడలేదు. అజారుద్దీన్​కు మంత్రి పదవి ఇవ్వాలని గతంలోనే సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇది కార్యరూపం దాల్చింది. ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకు అజారుద్దీన్​కు మంత్రి పదవి ఇచ్చామన్న కేటీఆర్ విమర్శల్లో నిజం లేదు. లీడర్ అనేవాడు ముందు ప్రజల సమస్యలు వినాలి. అప్పుడు బాధితులకు సగం భరోసా కలుగుతది. దాదాపు 70 శాతం సమస్యలు ఇట్లనే పరిష్కారం అవుతాయి’’అని మంత్రి వివేక్ అన్నారు. ఓపికగా ప్రజా సమస్యలు వినే లక్షణం నవీన్ యాదవ్​లో ఉన్నదని, ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మీ బిడ్డగా స్వీకరించి  మద్దతు తెలపాలని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కోరారు. తనను పొలిటికల్ లీడర్​గా కాకుండా.. మీలో ఒకరిగా చూడాలన్నారు. మంత్రి వివేక్ నేతృత్వంలో కొన్ని నెలలుగా నియోజకవర్గంలో వేగంగా అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. సమావేశంలో కార్వాన్ ఎమ్మెల్యే కైసర్ మొయినుద్దీన్, లోకల్ లీడర్లు
పాల్గొన్నారు. 

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

మొంథా తుఫాన్​ కారణంగా నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన రిలీజ్ చేశారు. ‘‘అకాల వర్షాలతో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని రైతులు పత్తి, వరి పంటలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన పడొ ద్దు. నియోజకవర్గంలో పంట నష్టంపై సర్వే చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్, వ్యవసాయ శాఖ ఆఫీసర్లను ఆదేశించిన. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​ రావుతో మాట్లాడిన. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నం’’అని మంత్రి వివేక్ పేర్కొన్నారు.