
- ‘తెలంగాణ రైజింగ్ 2047’విజన్ తో ముందుకెళ్తున్నం
- ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని వెల్లడి
- మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండావిష్కరణ
మెదక్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’విజన్ తో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని తెలిపారు. మెదక్ జిల్లాలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం మంత్రి మాట్లాడారు.‘‘మెదక్ లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కోసం రూ.180 కోట్లు, నర్సింగ్ కాలేజ్ కోసం రూ.26 కోట్లు మంజూరయ్యాయి. రూ.200 కోట్లతో రామాయంపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో 9,125 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.456 కోట్లు కేటాయించాం.
రూ.35 కోట్లతో ఏడుపాయల, రూ.29.18 కోట్లతో మెదక్ చర్చిని అభివృద్ధి చేస్తున్నాం. 7,758 మహిళా సంఘాలకు రూ.110 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు, 10,574 సంఘాలకు రూ.21.69 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరయ్యాయి. భూ భారతి చట్టం కింద గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 37,817 అర్జీలు వచ్చాయి. వాటిని పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతున్నది’’అని వివేక్ అన్నారు.
వ్యవసాయ డ్రోన్లపై కేంద్రం సబ్సిడీ ఇవ్వాలి
ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతు భరోసా పథకం కింద 2,62,043 మంది రైతుల ఖాతాల్లో రూ.220 కోట్లు జమ చేశామని మంత్రి వివేక్ అన్నారు. రైతు రుణ మాఫీ కింద 87,491 మంది రైతులకు రూ.645 కోట్లు మాఫీ చేశామని తెలిపారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి అమలుతో పాటు అన్ని హామీలు నెరవేర్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ‘‘వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే డ్రోన్ లకు కేంద్రం సబ్సిడీ ఇవ్వాలి.
డ్రోన్ ద్వారా రోజుకు 20 నుంచి 30 ఎకరాల వరకు మందులను పిచికారి చేయొచ్చు. ఒక్కో డ్రోన్ ఖరీదు రూ.10 లక్షల వరకు ఉండటంతో చిన్న, సన్నకారు రైతులు కొనలేరు. వీటిపై రైతులకు సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలి. కూలీలు దొరక్కపోవడంతోనే యాంత్రీకరణ పెరిగింది’’అని వివేక్ అన్నారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రావు పాల్గొన్నారు.