వైద్య రంగానికి సర్కారు ప్రాధాన్యం..ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినం: మంత్రి వివేక్‌‌

వైద్య రంగానికి సర్కారు ప్రాధాన్యం..ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినం: మంత్రి వివేక్‌‌
  • కామన్వెల్త్ మెడికల్ ఏఐ గ్లోబల్ సమిట్‌‌లో ప్రసంగం
  • హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్‌‌ కుమార్ ​గౌడ్​

హైదరాబాద్, వెలుగు: వైద్య రంగానికి రాష్ట్ర సర్కారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. శనివారం హైదరాబాద్‌‌లోని జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌‌లో నిర్వహించిన కామన్వెల్త్‌‌ మెడికల్ ఏఐ గ్లోబల్ సమిట్‌‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 వైద్య రంగంలో ఏఐ వాడకం, దాని ఉపయోగాలు, ప్రభావాలపై డాక్టర్లు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహించారు.  పీసీసీ చీఫ్ మహేశ్‌‌ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్‌‌ మాట్లాడుతూ..  పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచిందని గుర్తు చేశారు.  

చిన్న ఆస్పత్రులు కూడా మనుగడ సాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. పేదలకు ఆపన్నహస్తం అందించడంలో సీఎంఆర్‌‌ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతున్నదని, నిరుడు సీఎంఆర్‌‌ఎఫ్ కోసం ప్రభుత్వం రూ. 900 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. 

డాక్టర్ అవ్వాలనుకున్నా..: మహేశ్‌‌ గౌడ్

చిన్నప్పుడు తాను కూడా డాక్టర్ అవ్వాలని అనుకున్నానని, కానీ పరిస్థితుల ప్రభావంతో రాజకీయ నాయకుడిగా మారాల్సి వచ్చిందని పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌గౌడ్​ అన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యంపై సీరియస్‌‌గా దృష్టి పెట్టిందని తెలిపారు. వైద్య రంగంలో ఏఐ రాక స్వాగతించదగ్గ పరిణామమే అయినా.. దాని వల్ల మంచి ఎంత ఉందో, చెడు కూడా అంతే ఉందన్నారు. ఏఐ వల్ల డాక్టర్ల పని సులువు కావాలి కానీ, దీని వల్ల నష్టం జరగకూడదని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌‌గా మారుస్తం: పొన్నం

 రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌‌గా మార్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకుపోతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌‌ అన్నారు.  అధునాతన వైద్య సదుపాయాలు ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్లు ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. మారుతున్న సాంకేతికతకు తగ్గట్టుగా డాక్టర్లు ఏఐ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.