పదేండ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి

పదేండ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     పేదలు, బడుగు బలహీనవర్గాల పార్టీ కాంగ్రెస్: మంత్రి వివేక్​ వెంకటస్వామి​
  •     జూబ్లీహిల్స్​​లో నవీన్​ యాదవ్​ను గెలిపించాలని పిలుపు
  •     జోరు వానలో ఎన్నికల ప్రచారం

జూబ్లీహిల్స్ , వెలుగు:  బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని.. వాటికి ఓటేస్తే అభివృద్ధి జరగదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బీఆర్ఎస్​ అధికారంలో ఉన్న పదేండ్లు ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. జూబ్లీహిల్స్ బైపోల్​ ప్రచారంలో భాగంగా మంత్రి వివేక్  బుధవారం షేక్ పేటలోని వినాయక్ నగర్ లో పర్యటించారు. ఆయనకు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి ఆధ్వర్యంలో పగిడి కట్టి స్వాగతం పలికారు. జోరు వానలో మంత్రి వివేక్​ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘పేదలు, బడుగు బలహీనవర్గాల పార్టీగా పేరున్న కాంగ్రెస్ పార్టీకి  ప్రజల నుంచి బ్రహ్మాండమైన మద్దతు లభిస్తున్నది. ఈ ఉప ఎన్నికలో షేక్ పేట డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ తీసుకురావాలని నాయకులను కోరుతున్న” అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడని, ఆయనను గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 

జూబ్లీహిల్స్​కు బీఆర్​ఎస్​ చేసిందేమిటి?

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కోసం తమ ప్రజా ప్రభుత్వం రూ.200 కోట్లు వెచ్చించిందని, ఇదే తరహాలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం రాత్రి టోలిచౌకిలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్​కు మద్దతుగా అజారుద్దీన్​తో కలిసి ప్రచారం నిర్వహించారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్ పార్టీ జూబ్లీహిల్స్​లో చేసిన అభివృద్ధి ఏమిటని మంత్రి ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్లినా సమస్యలు తమకు ఎదురయ్యాయన్నారు. ముస్లిం సోదరులు ఎప్పటినుంచో ప్రతిపాదిస్తున్న కబ్రస్థాన్  కు బీఆర్ఎస్  10 ఏండ్లు అధికారంలో ఉన్నా ఎందుకు స్థలాన్ని కేటాయించలేదని నిలదీశారు. కాంగ్రెస్​ సీనియర్​ నేత అజారుద్దీన్ మాట్లాడుతూ.. నవంబర్ 11న భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ ను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో నేతలు ఫయీమ్ ఖురేషి, కూన శ్రీశైలం గౌడ్, ఏనుగు రవీందర్  రెడ్డి తదితరులు పాల్గొన్నారు.