- రాష్ట్రంలో గనుల శాఖలో విప్లవాత్మక సంస్కరణలు
- 22% పెరిగిన గనుల ఆదాయం
- అక్రమాల కట్టడికి డ్రోన్లు, ఏఐ సాంకేతికతతో పటిష్ట నిఘా
- గుజరాత్లో రాష్ట్రీయ ఖనిజ చింతన్ శివిర్‌లో ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: భవిష్యత్తు అంతా ‘రేర్ ఎర్త్ మినరల్స్’ దేనని మంత్రి వివేక్ తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధిలో ఖనిజాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. వీటిపై మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా కేంద్రం, అటామిక్ ఎనర్జీ విభాగాలు దృష్టి సారించడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శుక్రవారం జరిగిన ‘రాష్ట్రీయ ఖనిజ చింతన్ శివిర్-2026’ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గనుల శాఖ పనితీరు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు.
తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారని, ఈ లక్ష్య సాధనలో గనుల శాఖ ఇంజిన్‌లా పని చేయనుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం జాతీయ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో తెలంగాణ వాటా సుమారు 2.4 శాతంగా ఉందని మంత్రి వివేక్ తెలిపారు. దీనిని రాబోయే రోజుల్లో 5 శాతానికి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ దిశగా గనుల శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని.. ఫలితంగా ఈ మధ్య కాలంలో గనుల ఆదాయం 22 శాతం పెరిగిందని గణాంకాలతో సహా వివరించారు.
‘ఫస్ట్ కమ్-.. ఫస్ట్ సర్వ్’ విధానానికి స్వస్తి
గతంలో మాదిరిగా ‘ఫస్ట్ కమ్–ఫస్ట్ సర్వ్’ విధానానికి స్వస్తి పలికినట్టు మంత్రి వెల్లడించారు. పారదర్శకంగా.. ఇసుకతో పాటు చిన్న, పెద్ద ఖనిజాలకు వేలం విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల ఖనిజాలకు సరైన ధర దక్కడంతో పాటు జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. జీరో అక్రమ మైనింగ్, జీరో అక్రమ రవాణా, జీరో ఓవర్‌లోడింగ్ అనే మూడు సూత్రాలతో ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. తాత్కాలికంగా కొన్ని ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనా దీర్ఘకాలంలో ఈ సంస్కరణలు బలమైన, స్థిరమైన ఫలితాలను ఇస్తాయని ఆయన అన్నారు.
అక్రమాలను అరికట్టేందుకు ఏఐ వినియోగం
అక్రమ మైనింగ్‌ను ఉక్కుపాదంతో అణచివేసేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్టు మంత్రి తెలిపారు. జీపీఎస్ ట్రాకింగ్, డ్రోన్ల నిఘా, శాటిలైట్ మ్యాపింగ్‌తో అక్రమార్కుల ఆట కట్టిస్తున్నామన్నారు. గనుల రంగంలో సామర్థ్యాన్ని పెంచేందుకు, అక్రమాలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ప్రత్యేక అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సదస్సును నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
