- ఇసుక, భూ దందా, దొడ్డు బియ్యం అక్రమ దందా కట్టడి చేసినం: వివేక్ వెంకటస్వామి
- గత బీఆర్‌ఎస్ సర్కార్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఆపేసింది
- కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు
- తోడ్పాటు అందిస్తున్నది యువతకు ఉపాధి కల్పించేందుకు ఏటీసీ కేంద్రాలు
- చెన్నూరులో మంత్రి జూపల్లితో కలిసి ఏటీసీ కేంద్రానికి భూమి పూజ
కోల్‌బెల్ట్, వెలుగు: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుక, భూ దందా, దొడ్డు బియ్యం మాఫియా కొనసాగిందని, ప్రజా ప్రభుత్వంలో వాటన్నింటికీ చెక్ పెట్టామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మిషన్ భగీరథ పేరుతో గత సర్కార్ రూ.62 వేల కోట్లు దోపిడీ చేసిందని ఆరోపించారు. కేసీఆర్‌కు రాత్రి ఎవరో సలహా ఇస్తే ఉదయం దాన్ని అమలు చేసేవారని, కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా ఇలా నిర్ణయం తీసుకొని రూ.లక్ష కోట్లు వృధా చేశారని మండిపడ్డారు. జిల్లాల పునర్విభజన కూడా ఇలాంటిదేనని విమర్శించారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పర్యటించారు. చెన్నూరులో రూ.47.11 కోట్లతో నిర్మించనున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) నిర్మాణానికి మంత్రులు, కలెక్టర్ కుమార్ దీపక్ భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహిళా శక్తి సంబురాల్లో పాల్గొని స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తూ, వారిని కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఆపేసిందని ఆరోపించారు. మేడారంలో జరిగిన కేబినెట్ మీటింగ్‌లో జిల్లాల పునర్విభజనపై చర్చించామని, అయితే, విభజనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎజెన్సీ ఏరియా వివాదం కారణంగా కోర్టులో కేసులు ఉండడం వల్ల మందమర్రి, మణుగూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగడం లేదని, దీనిపై కేబినెట్‌లో చర్చించామని చెప్పారు. తాను ఎమ్మెల్యే అవ్వగానే కలెక్టర్ ద్వారా కోర్టులో కౌంటర్ దాఖలు వేయించానని, చైర్మన్‌తో పాటు 50 శాతం పదవులు ఎస్టీలకు ఇస్తే ఎన్నికలు జరిగే వీలుందని తెలిపారు. నియోజకవర్గంలో మహిళలకు ఒక పెట్రోల్ బంక్‌ను మంజూరు చేశామని, త్వరలో చెన్నూరులో కూడా కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు.
రూ.20 వేల కోట్ల రుణ మాఫీ: జూపల్లి
రైతు సంక్షేమంలో భాగంగా దాదాపు రూ.20 వేల కోట్ల రుణ మాఫీ చేశామని ఆదిలాబాద్ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అలాగే, రైతు భరోసా, రైతు బీమా పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. చెన్నూరు మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ప్రజల సంక్షేమం దిశగా కృషి చేస్తామని తెలిపారు.
ఉద్యోగాలొచ్చేలా ఏటీసీ కేంద్రాల్లో శిక్షణ..
యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేలా శిక్షణ ఇచ్చేందుకు ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివేక్ అన్నారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా స్కిల్స్ పెంపొందేలా ఆధునాతన కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. మందమర్రిలో ఒక సెంటర్నడుస్తుందని, ఇప్పుడు చెన్నూరులో కొత్త సెంటర్‌కు శంకుస్థాపన చేశామన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేగా పదేండ్లు కొనసాగిన బాల్క సుమన్ నియోజకవర్గ ప్రజల కనీస అవసరాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే అయ్యాక గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించినట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి చెన్నూరు అభివృద్దికి రూ.100 కోట్లు మంజూరు చేయించానని గుర్తుచేశారు. మరోవైపు, చెన్నూరులో త్వరలో బస్సు డిపో ఏర్పాటు చేస్తామని తెలిపారు. బస్‌డిపో కోసం కేటాయించిన స్థలాన్ని కూడా బీఆర్‌ఎస్ లీడర్లు కబ్జా చేశారని ఆరోపించారు. చెన్నూరులోని 50 పడకల ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని, 100 పడకల ఆసుపత్రిని మే నెలలో ప్రారంభించ నునట్లు చెప్పారు. సింగరేణి భూముల్లోని ఇండ్ల జాగాలకు పట్టాలిచ్చే 76 జీవోపై బ్యాన్ఉందని, దాన్ని పునరుద్దరించాలని కేబినెట్‌లో సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. మున్సిపాలిటీలను మరింత అభివృద్ధి చేసుకోవడానికి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
