V6 News

అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో పాలన: మంత్రి వివేక్ వెంకటస్వామి

అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో పాలన: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • సమానత్వం, సామాజిక న్యాయం కోసం చివరి వరకూ పోరాడుతం : మంత్రి వివేక్​ వెంకటస్వామి
  • అంబేద్కర్ బాటలో కాకా వెంకటస్వామి నడిచారు
  •     విద్యాసంస్థల ద్వారా రెండు లక్షల మందికి విద్యాదానం చేశారని వెల్లడి
  •     పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో 
  • పాల్గొన్న  మంత్రి వివేక్​, ఎంపీ వంశీకృష్ణ

పెద్దపల్లి/ గోదావరిఖని/ కోల్​బెల్ట్, వెలుగు: అంబేద్కర్ స్ఫూర్తితోనే కాంగ్రెస్​ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఆయన ఆశయాలైన సమానత్వం, సామాజిక న్యాయం కోసం చివరి వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం మంత్రి వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వివిధ చోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో అంబేద్కర్​ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి వివేక్​వెంకటస్వామి మంచిర్యాల ఐబీ చౌరస్తాలో, మందమర్రిలోని సింగరేణి హైస్కూల్​ వద్ద, సింగరేణి ఆధ్వర్యంలో గ్రీన్​పార్క్​ వద్ద, జైపూర్, భీమారం, చెన్నూరులో అంబేద్కర్​ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. చెన్నూరు మండలం సుద్దాల గ్రామంలో అంబేంద్కర్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని, రాజ్యాంగం చలవతోనే చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. దళితుల అభ్యున్నతి కోసం మహాత్మా గాంధీతో సైతం కొట్లాడిన ధీశాలి అన్ని అభివర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 అంబేద్కర్ విగ్రహాలను తాను డొనేట్ చేయడం అదృష్ణంగా భావిస్తున్నట్టు చెప్పారు. 


అంబేద్కర్​ బాటలో నడిచిన కాకా వెంకటస్వామి 

కేంద్ర  మాజీ మంత్రి కాకా వెంకటస్వామి కూడా అంబేద్కర్​బాటలో నడిచారని, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను అందించేందుకు అంబేద్కర్ విద్య సంస్థలను స్థాపించారని మంత్రి వివేక్​చెప్పారు. ఆ సంస్థల్లో 2 లక్షల మందికి విద్యాదానం చేశారన్నారు. అంబేద్కర్ కార్మిక శాఖ మంత్రిగా పని చేసి కార్మికుల సంక్షేమానికి కృషి చేశారని.. ఆయన అడుగుజాడల్లోనే తన తండ్రి కాకా వెంకటస్వామి, సోదరుడు గడ్డం వినోద్, తానూ కార్మిక శాఖ మంత్రులు గా ప్రజలకు సేవలందించే అవకాశం దక్కిందన్నారు. సింగరేణి కోల్​బెల్ట్​ ప్రాంతాల్లో కొత్త బొగ్గు గనుల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామని, దీనివల్ల తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. మందమర్రి ఏరియాలో 213 మంది సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను ఎలాంటి కండిషన్స్​ లేకుండా విధులకు తీసుకోవాలని సింగరేణి జీఎం రాధాకృష్ణను మంత్రి ఆదేశించారు. చెన్నూరు మైనారిటీ ఫంక్షన్ హాల్ లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్​ప్రెన్యూర్స్​ ఆఫ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని  అలీప్ సంస్థ సంయుక్త కార్యదర్శి కవిత రాజేశ్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరితో కలిసి మంత్రి ప్రారంభించారు. మహిళలకు కుట్టుశిక్షణ అందించి 400 మెషీన్లు అందజేయనున్నట్టు మంత్రి తెలిపారు. అంబేద్కర్ ఉత్సవ సమితి ఆధ్వర్యలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. చెన్నూర్ మండలం సోమనపల్లిలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, ఏసీపీలు కిరణ్​కుమార్, వెంకటేశ్వర్లు, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, స్థానిక ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్​ లీడర్లు పాల్గొన్నారు.