ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తం..గత ప్రభుత్వ దోపిడీ వల్లే సంక్షేమ పథకాలు ఆలస్యం: మంత్రి వివేక్

ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తం..గత ప్రభుత్వ దోపిడీ వల్లే సంక్షేమ పథకాలు ఆలస్యం: మంత్రి వివేక్

సిద్దిపేట/సిద్దిపేట రూరల్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన లక్ష కోట్ల దోపిడీ వల్లే ప్రస్తుతం సంక్షేమ పథకాల అమలులో ఆలస్యం అవుతోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. అయినప్పటికీ వచ్చే మూడేండ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు. బుధవారం దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్ పేట భూంపల్లి, సిద్దిపేట కలెక్టరేట్ లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేల కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లకు చేర్చి ఖజానాను ఖాళీ చేశారని.. అందువల్లే సంక్షేమ పథకాలు ఆలస్యం అవుతున్నాయన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు 2,500తో పాటు, ఇతర హామీలను వచ్చే మూడేండ్లలో కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ప్రతినెలా 2,500తో పాటు ఆడ పిల్ల పెండ్లికి తులం బంగారం ఇవ్వాలని అడగగా.. మీరు చేసిన దోపిడీ వల్లే నిధులు లేకుండా పోయాయని.. అందువల్లే వారికి ఇవ్వలేకపోతున్నామని, మీరే ప్రజలకు సమాధానం ఇవ్వాలని హరీశ్ రావుకు మంత్రి చురకలు అంటించారు