- జూబ్లీహిల్స్ రిజల్ట్స్‌తో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది: మంత్రి వివేక్
- వారం రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తాం
- బీఆర్ఎస్ పదేండ్ల పాలన అంతా అవినీతిమయం
- అందుకే డిపాజిట్లు కూడా దక్కలేదు
- కేటీఆర్‌ను ప్రజలు నమ్ముతలేరు
- ఎన్నికలపై ఆశావహులకు మంత్రి దిశానిర్దేశం
కోల్‌బెల్ట్/జైపూర్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రిజల్ట్‌తో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలన.. అవినీతి, అహంకారంతో కొనసాగిందని, అందుకే ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని పేర్కొన్నారు. వారి హయాంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులకు డిపాజిట్లు రాలేదని విమర్శించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి, భీమారం, జైపూర్, చెన్నూరు మండలాల్లో గురువారం మంత్రి వివేక్ పర్యటించారు. మందమర్రి, జైపూర్ మండలంలోని దుబ్బాపల్లి, భీమారంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్కు కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. వరుస ఓటములతో ఆ పార్టీ కనుమరగవుతున్నది. కేటీఆర్ అసమర్థ నాయకత్వానికి ఇది నిదర్శనం. ప్రజలు కేటీఆర్‌ను నమ్మట్లేదు’’అని వివేక్ అన్నారు.
బీఆర్ఎస్ ఇచ్చిన భూములు మేం ఎట్ల అమ్ముతం?
బీఆర్ఎస్లో ఒక వైపు కేటీఆర్, హరీశ్.. మరోవైపు కవిత కొట్లాడుకుంటున్నారని మంత్రి వివేక్ అన్నారు. రానున్న రోజుల్లో కేటీఆర్, హరీశ్ మధ్య ఆధిపత్యం కోసం కొట్లాట తప్పదని పేర్కొన్నారు. ‘‘42శాతం బీసీ రిజర్వేషన్‌కు కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉంది. బీసీలను మభ్యపెట్టేందుకే కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నరు. పరిశ్రమలకు సంబంధించిన 9,500 ఎకరాల భూముల్లో స్కామ్ జరిగిందని కేటీఆర్, హరీశ్ పచ్చి అబద్దాలు చెప్తున్నరు. పరిశ్రమలకు బీఆర్ఎస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్ సర్కార్ ఎలా అమ్ముతుందో చెప్పాలి. కేటీఆర్‌కు కనీస పరిజ్ఞానం లేదు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఢిల్లీలోని పరిశ్రమలను సిటీ బయటికి తీసుకెళ్లారు. అదే పాలసీ విధానాన్ని హైదరాబాద్‌లోనూ అమలు చేయనున్నాం’’అని వివేక్ అన్నారు.
ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే
పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ ఒక్క రేషన్‌కార్డు, ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని మంత్రి వివేక్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తున్నదని తెలిపారు. ‘‘స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్టికెట్ కోసం లీడర్లు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనం. మంచి అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతది. జనాభా, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎక్కడా పొరపాట్లు జరగలేదు. లోకల్‌బాడీ ఎన్నికలకు సంబంధించి ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి. నేను కూడా సర్వే చేసి వారం రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తా. ఏకగ్రీవంగా ఎన్నికైతే గ్రామానికి రూ.15 లక్షలు ఇప్పిస్తా. గెలిచే సత్తా ఉండే అభ్యర్థులనే నిలబెడతాం’’అని వివేక్ అన్నారు. డిసెంబర్ లో జైపూర్ పవర్ ప్లాంట్ లో మూడో యూనిట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని, సింగరేణికి త్వరలో కొత్త బొగ్గు గనులను తీసుకొస్తామని తెలిపారు. వీటి ద్వారా కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. చెన్నూరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు.
డీసీసీ ప్రెసిడెంట్‌ను అభినందించిన మంత్రి
మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన పిన్నింటి రఘునాథ్ రెడ్డిని మంత్రి వివేక్ అభినందించారు. మంత్రిని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ కలిసి ఆర్కేపీ ఓసీపీ రెండో ఫేజ్ పబ్లిక్ హియరింగ్ వివరాలు తెలిపారు. మందమర్రి పాలచెట్టు ఏరియాలోని చర్చిలో పాస్టర్లు, బీ1 క్యాంపు ఆఫీస్ వద్ద దివ్యాంగులు మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. మంచిర్యాలలోని వసుధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జెట్టి మల్లయ్యను మంత్రి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
