- ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ అవసరం: వివేక్ వెంకటస్వామి
- పరీక్షల విషయంలో తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి చేయొద్దని సూచన
- రాయదుర్గం టీ వర్క్స్ వద్దఎగ్జామ్థాన్ రన్
గచ్చిబౌలి/ట్యాంక్ బండ్, వెలుగు: పరీక్షలంటే విద్యార్థులు భయపడొద్దని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎగ్జామ్స్ అంటే విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకు డాక్టర్‌బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ మెంటర్ సంస్థ ఆదివారం రాయదుర్గంలోని టీ వర్క్స్ వద్ద 3కె, 5కె, 10కె ఎగ్జామ్‌థాన్ రన్ నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి, కాకా బీఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్ ముఖ్య అతిథులుగా హాజరై, ప్రారంభించారు. ఈ రన్‌లో 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్న మంత్రి వివేక్.. ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ చాలా అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఎవరికైనా.. రోజులో ఒకటే ఉదయం ఉంటుందని చెప్పారు. తాను పాఠశాలకు వెళ్లే రోజుల్లో టేబుల్ టెన్నిస్, క్రికెట్ ఆడేవాడినని, విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని పేర్కొన్నారు. ఎగ్జామ్స్ అంటే భయం వల్ల చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నట్లు నివేదికలు వస్తున్నాయని, ఇది చాలా ఆందోళనకరమైన విషయమన్నారు. పరీక్షల విషయంలో పేరెంట్స్ పిల్లలపై ఒత్తిడి చేయొద్దని మంత్రి సూచించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ కరస్పాండెంట్ సరోజా వివేక్ మాట్లాడుతూ.. ఎర్లీ మార్నింగ్ ఇంతమంది విద్యార్థులు వస్తారని అనుకోలేదని, ఈ ఈవెంట్‌కు వీ6 మీడియా పార్టనర్‌గా ఉండడం సంతోషంగా ఉందన్నారు. స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థులు ఎలా ఉంటున్నారు.. వారు చదివే ఇన్స్టిట్యూట్స్ఎలా ఉంటున్నాయనే విషయాన్ని పేరెంట్స్ గమనించాలని సూచించారు. చాలా మంది విద్యార్థులు డ్రగ్స్, రీల్స్ కోసం గంటలకొద్దీ స్మార్ట్ ఫోన్లతో గడుపుతున్నారని, ఇది మంచిది కాదని హితవు పలికారు. విద్యార్థులెవరూ ఎగ్జామ్స్ అంటే భయం పెట్టుకోవద్దని, పేరెంట్స్ కూడా పిల్లలకు సమయం కేటాయించి, ధైర్యం చెప్పాలన్నారు. కావేరి యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి టైం మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమన్నారు. చదువుకోవాలి కానీ.. ఒత్తిడి పెంచుకోకూడదని చెప్పారు. జీవితంలో ఎగ్జామ్స్ ఒక్కటే ముఖ్యం కాదని, టాలెంట్ కూడా ఉండాలని పేర్కొన్నారు.
బుద్ధిస్టుల క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి వివేక్..
అంబేద్కర్ బుద్ధిజాన్ని పాటించినట్లే మనం కూడా ఆయన దారిలో వెళ్లాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. బహుజన సమాఖ్య సంఘటన్ ఆధ్వర్యంలో ఆదివారం హుస్సేన్ సాగర్‌లోని బుద్ధ విగ్రహం వద్ద బుద్ధిస్టుల క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. అంబేద్కర్ దేశానికి దారి చూపినట్లు మనం కూడా ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన సూచించిన విధంగా ఇతరులకు మేలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘటన్ ప్రెసిడెంట్ ప్రీత హరిత్ పాల్గొన్నారు.
