
- దాన్ని అంబేద్కర్ వాదులు తిప్పికొట్టాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
- ఆయన ఆశయాల సాధనకు అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపు
- మనం ఐక్యంగా ఉంటేనే రాజ్యాంగాన్ని కాపాడుకోగలం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- ఓట్ల తొలగింపుపై చర్చ జరగాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
- రాజ్యాంగ రక్షణపై రవీంద్రభారతిలో నేషనల్ సెమినార్
బషీర్‌బాగ్, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతున్నదని, దాన్ని అంబేద్కర్ వాదులు తిప్పికొట్టాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అందరూ ఏకతాటిపైకి రావాలన్నారు. అఖిల భారత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ‘ది మిషన్ టు సేవ్ ది కానిస్టిట్యూషన్’అనే అంశంపై నేషనల్ సెమినార్ నిర్వహించారు. దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఉద్యోగాలు పొందినోళ్లు, దాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘‘నాకు పదవులు ముఖ్యం కాదు. నా జాతిని వివక్ష నుంచి దూరం చేయడమే ముఖ్యం. వివక్షను ఎదిరించి ఉద్యోగులు పైస్థాయికి రావడం అభినందనీయం.
ప్రభుత్వ ఉద్యోగులు తమ జాతి అభివృద్ధికి పాటుపడాలి. ఒక్కొక్కరు 10 మందికి సాయం చేసి, వారిని వృద్ధిలోకి తీసుకురావాలి”అని సూచించారు. ‘‘నా తండ్రి కాకా వెంకటస్వామి నుంచే నేను సేవాతత్వం అలవర్చుకున్నాను. నా తండ్రి 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ అంబేద్కర్ విద్యాసంస్థలను నెలకొల్పి వేల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఇప్పుడీ విద్యాసంస్థల్లో 6 వేల మంది చదువుకుంటున్నారు. వారిలో 75% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. 80 శాతానికి పైగా మార్కులు సాధించిన స్టూడెంట్లకు ఫ్రీగా ఎడ్యుకేషన్ అందిస్తున్నాం”అని తెలిపారు. కాగా, సమాఖ్య జాతీయ చైర్మన్ ఉదిత్ రాజ్, రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ ఆధ్వర్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామిని ఘనంగా సన్మానించారు.
మతం పేరుతో చిచ్చు పెడుతున్నరు:
పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
మనం లేకుంటే దేశం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కలయికే మన దేశమని పేర్కొన్నారు. మనం ఐక్యంగా ఉంటేనే రాజ్యాంగాన్ని కాపాడుకోగలమని అన్నారు. దేశాన్ని ఏలుతున్నోళ్లు మతం పేరుతో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. మహారాష్ట్రలో గెలవడానికి ప్రధాని మోదీ ఓట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. మతోన్మాద శక్తులను అడ్డుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యంగా ఉంటే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్, దళిత సంఘ నాయకుడు జేబీ రాజు, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
సమాజంలో ఎవరెంతో వారికంత వాటా ఉండాలి: పొన్నం
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా సామాజిక న్యాయంపై ఇంకా చర్చ జరగడం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సమాజంలో ఎవరెంతో వారికంత వాటా ఉండాలని చెప్పారు. ఓటు హక్కు ఆయుధమని, కుట్రపూరితంగా దాన్ని తొలగిస్తున్నారని.. దీనిపై చర్చ జరగాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నదని చెప్పారు. హక్కుల కోసం అందరం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు.