కమీషన్ల కోసమే బీఆర్ఎస్ కాళేశ్వరం కట్టింది.. బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలు: మంత్రి వివేక్

కమీషన్ల కోసమే బీఆర్ఎస్ కాళేశ్వరం కట్టింది.. బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలు: మంత్రి వివేక్
  • గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడింది
  • సింగరేణి కార్మికులకు లాభాల్లో 34% వాటా ఇస్తున్నం
  • కమీషన్ల కోసమే బీఆర్ఎస్ కాళేశ్వరం కట్టింది
  • బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలు అని వ్యాఖ్య
  • భీమారంలో పీహెచ్​సీ ప్రారంభోత్సవానికి హాజరు

కోల్​బెల్ట్/జైపూర్/​చెన్నూరు, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గవర్నమెంట్ హాస్పిటళ్ల అభివృద్ధి, పూర్తి స్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని నియమించి సేవలు అందిస్తున్నదని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో రూ.1.43 కోట్ల 15వ ఫైనాన్స్ ప్లానింగ్ కమిషన్ నిధులతో నిర్మించిన పీహెచ్​సీని మంత్రి వివేక్ సోమవారం ప్రారంభించారు. అనంతరం భీమారం, చెన్నూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించలేదు. నేను చెన్నూరు ఎమ్మెల్యే అయ్యాక.. ఇచ్చిన మాట ప్రకారం 3 నెలల్లోనే మండలానికి 108 అంబులెన్స్ సర్వీసు తీసుకొచ్చిన. చెన్నూరు నియోజకవర్గపరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు  చేస్తున్నాం. రూ.15 కోట్లతో భీమారంలో మినీ స్టేడియం నిర్మించాలని క్రీడల మంత్రి శ్రీహరికి విన్నవించాను’’అని మంత్రి వివేక్ అన్నారు. 

కాళేశ్వరం బ్యాక్ వాటర్తో పంటలు మునుగుతున్నయ్​
చెన్నూరు నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి అవసరమైన అటవీ శాఖ అనుమతులు పొంది పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వివేక్ తెలిపారు. ‘‘తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్ట్ ను కాళేశ్వరంలో నిర్మించి రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ సర్కార్ అప్పుల ఊబిలోకి నెట్టింది. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది. ప్రాజెక్టు బ్యాక్ వాటర్​తో ఏటా రైతుల పంట పొలాలు మునిగిపోతున్నాయి. బ్యాక్ వాటర్ సమస్య పరిష్కారానికి​ కేటీఆర్ ఇంటి ముందు, యూరియా కొరత తీర్చేందుకు ఢిల్లీలో బాల్క సుమన్​ ధర్నాలు చేయాలి. బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలు. రెండు పార్టీల మధ్య దోస్తానా నడుస్తున్నది’’అని మంత్రి వివేక్ అన్నారు. విద్యా వ్యవస్థను పటిష్ట పర్చేందుకు సోమనపల్లిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తున్నం
చెన్నూర్, కోటపల్లి మండలాల్లో సాగుకు అవసరమైన 500 టన్నుల యూరియా అందిస్తామని మంత్రి వివేక్ ప్రకటించారు. ‘‘నేను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రంతో మాట్లాడి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించిన. ఏటా 4.5 మిలియన్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నది.  సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తున్నం. లాభాల్లో 34 శాతం బోనస్ ప్రకటించాం. గత బీఆర్ఎస్ హయాంలో సింగరేణికి రూ.2వేల కోట్ల లాభాలు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక లాభాలు మూడింతలు పెరిగేలా చర్యలు తీసుకున్నం. సంస్థకు రూ.6,394 కోట్ల లాభాలు వచ్చాయి. అందులో 34 శాతం (రూ.819 కోట్లు) కార్మికులకు పంచుతున్నాం’’అని మంత్రి వివేక్ అన్నారు. 

లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు
మంచిర్యాల జిల్లా భీమారం, చెన్నూరు మండలాల్లో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. అర్హులైన 111 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబాకర్​ చెక్కులను కలెక్టర్ కుమార్ దీపక్​తో కలిసి అందజేశారు. అనంతరం చెన్నూరు పట్టణంలోని 13వ వార్డులో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూజలు చేశారు.

షేక్​పేట అభివృద్ధి బాధ్యత ప్రభుత్వానిదే..
జూబ్లీహిల్స్, వెలుగు: హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్‌‌‌‌‌‌‌‌పేటలోని సమస్యలను పరిష్కరించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ, ఇతర శాఖల అధికారులతో కలిసి షేక్​పేటలోని బల్కాపూర్ నాలా, లక్ష్మిపేట ప్రాంతాలను సోమవారం వివేక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంజీ కాలనీలో చేపట్టాల్సిన పనులకు వెంటనే ఎస్టిమేషన్ తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తర్వాత తేజ కాలనీలో నిర్వహించిన బూత్ లెవల్ కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

ఈ సందర్భంగా తేజ కాలనీలో రోడ్డు అస్తవ్యస్తంగా ఉందని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులను వారం రోజుల్లో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. షేక్​పేటలో డ్రైనేజీ, తాగునీరు, సీసీ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేసి ఇప్పటికే పనులు ప్రారంభించినట్లు చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, చైర్మన్లు ఫయీమ్, అజ్మతుల్లా హుస్సేన్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.