
- ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులను కోరిన మంత్రి వివేక్ వెంకటస్వామి
- సెక్రటేరియెట్ లో మంత్రిని కలిసిన జర్మనీ ప్రతినిధులు
- రాష్ట్ర యువతకు భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగావకాశాలపై చర్చలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో నర్సింగ్ చేసిన విద్యార్థులతోపాటు, ఐటీఐ పూర్తి చేసిన యువతకూ జర్మనీలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులను కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖల మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి కోరారు. మంగళవారం రాష్ట్ర సెక్రటేరియెట్ లో జర్మనీ ప్రతినిధులు మంత్రిని కలిశారు. తెలంగాణ నర్సులకు జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చేపట్టిన ‘ట్రిపుల్ విన్’ ప్రాజెక్టుపై, భవిష్యత్తులో రాష్ట్ర యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించడంపై సమావేశంలో చర్చించారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. జర్మనీలో ఆస్బిల్డుంగ్(వొకేషనల్) ప్రోగ్రామ్ కింద నర్సింగ్ తోపాటు ఐటీఐ వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు.
జర్మనీ సహకారంతో భవిష్యత్తులో మరిన్ని కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశం తర్వాత జర్మనీ ప్రతినిధులు తార్నాకలోని టీసీఎస్ఆర్టీసీ నర్సింగ్ కాలేజీకి వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడారు.జర్మనీలో భారతీయ నర్సులకు ఎంత మంచి అవకాశాలు ఉన్నాయో, ఎంత జీతం వస్తుందో తెలియజేశారు. కుటుంబంతో సహా వీసా పొంది అక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
నవంబర్ కల్లా జర్మనీకి మన నర్సులు..
తెలంగాణ ప్రభుత్వం, జర్మనీ కలిసి టామ్ కాం ద్వారా ‘ట్రిపుల్ విన్’ ప్రాజెక్టును చేపట్టాయి. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని నర్సులకు ఉచితంగా జర్మన్ భాష నేర్పిస్తారు. ఆ తర్వాత జర్మనీలోని పెద్ద హాస్పిటల్స్ లో ఉద్యోగాలు కల్పిస్తారు. ప్రస్తుతం జులై 9 నుంచి17 వరకు బేగంపేటలోని పర్యాటక భవన్‌లో నర్సులకు ఇంటర్వ్యూలు జరగనునాయి. నిరుడు (జులై 2024) ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన 2024 బ్యాచ్ నర్సులు ఇప్పటికే జర్మన్ భాష నేర్చుకున్నారు. వీరు వీసా పనులు పూర్తవగానే అక్టోబర్- లేదా నవంబర్ 2025కల్లా జర్మనీకి వెళ్లనున్నారు.