- లక్ష ఓట్ల మెజారిటీని సాధించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
- జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా కాపుల సమావేశం
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీలంతా ఏకమై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. నవీన్ యాదవ్‌కు మద్దతుగా కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మిరియాల రాఘవరావు ఆధ్వర్యంలో ఆదివారం కొండాపూర్‌లోని ఓ హోటల్‌లో కాపు, మున్నూరు కాపు సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్, పీసీసీ డిసిప్లినరీ కమిటీ వైస్ చైర్మన్ శ్యాం మోహన్, మాజీ ఎమ్మెల్యే వి.హనుమంతరావు పాల్గొన్నారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని, అయితే, లక్ష ఓట్ల మెజారిటీని సాధించేందుకు మనందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలో బీసీలంతా నవీన్ యాదవ్‌ను గెలిపించుకోవడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం ఇవ్వాలన్న డిమాండ్‌ను మరింత బలంగా వినిపించిన వారమవుతామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో మరిన్ని సీట్లను బీసీల కోసం రాబట్టుకునేందుకు ఇది ఒక అవకాశమన్నారు.
కాపులకు తగిన ప్రాధాన్యత: మంత్రి పొన్నం
కాపు సమాజం ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వానికి విశ్వాసంతో ఉన్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు, జీహెచ్ఎంసీ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో కాపు సమాజానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మిరియాల రాఘవరావు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కాపు, మున్నూరు కాపు సమాజం ఐక్యంగా ఉండి నవీన్ యాదవ్ విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ప్రజాహిత సంక్షేమ పథకాలను కొనసాగించడానికి హస్తం గుర్తుకు ఓటేసి నవీన్‌ను గెలిపించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిర్యాల ప్రీతం, గాలి అనిల్ కుమార్, బొమ్మ శ్రీరామ్, దాసరి రంగారావు, శ్రీరామ్ మూర్తి, మున్నూరు కాపు సంఘాల నాయకులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 600 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు.
