రాష్ట్రంపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ.. నిధుల కేటాయింపులో వివక్ష: మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ.. నిధుల కేటాయింపులో వివక్ష: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి పోతే.. వచ్చేది 20 పైసలే
  • బలహీనవర్గాలకు ఉపాధిని దూరం చేసేందుకు బీజేపీ కుట్ర 
  • ఎంఎన్‌‌ఆర్‌‌ఈజీఎస్ నుంచి గాంధీ పేరును తొలగించడమేమిటి?
  • ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి.. జనవరి 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు 
  • కేటీఆర్.. ముందుగా నీ కుటుంబ తగాదాలు పరిష్కరించుకో..
  • మీ చెల్లి కవిత చేసిన ఆరోపణలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్​
  • అసెంబ్లీకి ప్రతిపక్ష నేత కేసీఆర్​ రావాలి: మంత్రి పొన్నం ప్రభాకర్​
  • కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్ణయాలే దేశ అభివృద్ధికి దోహదం చేశాయి: మంత్రి అజారుద్దీన్


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని మంత్రి వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి రూపాయి తీసుకొని.. తిరిగి 20పైసలు మాత్రమే ఇస్తున్నదన్నారు. నిధుల కేటాయింపులో వివక్ష ప్రదర్శిస్తున్నదని తెలిపారు. బలహీనవర్గాలకు ఉపాధి దక్కొద్దని బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ ఆర్ ఈజీఎస్ ) పేరు మార్పు నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు. 

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరుపై ద్వేషభావంతో వ్యవహరిస్తున్నదని, ముఖ్యంగా బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలపై అసహనం ప్రదర్శిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ వేడుకలు ఆదివారం గాంధీ భవన్ లో జరిగాయి. అనంతరం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ తో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంఎన్ ఆర్ ఈజీఎస్ ద్వారా ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలకు ఉపాధి భరోసా లభిస్తున్నదని, దాన్ని ప్రజలకు దూరం చేసేందుకు బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. 

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని.. కాంగ్రెస్​ అధిష్టానం ఆదేశాల మేరకు జనవరి 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కొత్త బిల్లుతో స్కీమ్​ వ్యయంలో సుమారు 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపుతూ, రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల బకాయిలను సకాలంలో విడుదల చేయడంలో కేంద్రం విఫలమవుతున్నదన్నారు. ఈ విధానాల వల్ల రాష్ట్రాలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. రాష్ట్రాల అప్పులపై ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు విధించడం ద్వారా రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను కట్టడి చేస్తున్నారని మండిపడ్డారు. “తెలంగాణ ఒక్క రూపాయి పన్ను కడితే  కేంద్రం తిరిగి మన రాష్ట్రానికి  20 పైసలు ఇస్తున్నది.  ఉత్తరప్రదేశ్​ ఒక్క రూపాయి కేంద్రానికి కడితే 20 రూపాయలు తిరిగి ఇస్తున్నది” అని పేర్కొన్నారు.  

గ్రామ సభల్లో తీర్మానం చేయాలి: పొన్నం 

స్వాతంత్ర్యం సాధించడంలో కాంగ్రెస్  కీలక పాత్ర పోషించిందని, తెలంగాణను ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని మంత్రి పొన్నం ప్రభాకర్  తెలిపారు. వలసలను తగ్గించడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం ను తీసుకు వచ్చిందని, ఈ స్కీమ్ ను పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు మొత్తం పథకం తీసివేయాలని చూస్తున్నదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగే మొదటి గ్రామ సభల్లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాథి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని కోరుతున్నామని తెలిపారు. “అసెంబ్లీ సమావేశాలకు బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు రావాలి. సభలో ప్రతిపక్ష పాత్రను పోషించాలి. మేం హార్ట్ పేషెంట్లం కాదు.. సభకు మేం రెడీగా ఉన్నాం” అని మంత్రి పొన్నం పేర్కొన్నారు. 

కాంగ్రెస్ నిర్ణయాలతోనే దేశాభివృద్ధి: అజారుద్దీన్

గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ  విజన్ వల్లే దేశం ఇప్పుడు ఈ స్థితిలో ఉందని, కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలే దేశాభివృద్ధికి దోహదం చేశాయని మంత్రి అజారుద్దీన్ అన్నారు. మతాలకు అతీతంగా కాంగ్రెస్ పరిపాలన సాగిందని తెలిపారు. గాంధీ పేరు కనిపించడం బీజేపీకి ఇష్టం లేదని, గొప్ప ఆశయంతో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్​ నుంచి గాంధీ పేరును తీసేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు.

కేటీఆర్.. ముందు నీ కుటుంబ తగాదాలు పరిష్కరించుకో

కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే ముందు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్​ తన కుటుంబ వివాదాలను  పరిష్కరించుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ‘‘కేటీఆర్  ఫ్రస్ట్రేషన్​లో ఉన్నడు. చెల్లె  కవిత చేస్తున్న ఆరోపణలకు ముందుగా ఆయన సమాధానాలు ఇవ్వాలి. తర్వాత కాంగ్రెస్ గురించి మాట్లాడాలి. బీఆర్ ఎస్ పార్టీ ప్రజాదరణను కోల్పోయింది” అని వ్యాఖ్యానించారు.  ప్రజల తీర్పు నిరంతరం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా వస్తున్నదని, ఇది ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నదని తెలిపారు. 

‘‘2023 అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత వరుసగా జరిగిన  లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ  ఎన్నికలు, కాంటోన్మెంట్ ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పరాజయాలు చూసింది. ప్రతి ఎన్నికలో ప్రజలు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్పష్టంగా తిరస్కరించారు. అయినా ఆ పార్టీ నేతలు ఇప్పటికీ ప్రజల తీర్పును అర్థం చేసుకోవటం లేదు. 2023 ఎన్నికల్లో సారు.. కారు...16 అన్నారు.. పరారు అయ్యారు . పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి గుండు సున్నా వచ్చింది” అని మంత్రి వివేక్​ వ్యాఖ్యానించారు.