- స్పీకర్ ను, ఆయన తల్లిని దూషించడం హేయమైన చర్య: మంత్రి రాజనర్సింహ
- మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే రాష్ట్రంలోని యువత తిరగబడుతుంది
హైదరాబాద్, వెలుగు: ‘దళితుల చరిత్ర అంటేనే పోరాటాల చరిత్ర.. ఆత్మగౌరవ చరిత్ర. మాకు అవమానాలు, పోరాటాలు కొత్త కాదు. ఆత్మగౌరవమే మా అలంకారం. అదే మా స్ఫూర్తి. ఆ ఆత్మగౌరవంతోనే ఈ స్థాయికి వచ్చాం’ అని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగితే తెలంగాణ యువత తిరగబడుతుందని, దళిత సమాజాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయొద్దని ఆయన హెచ్చరించారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనమండలి చైర్మన్‌కు సిఫారసు చేసే తీర్మానాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ శాసన సభలో ప్రవేశపెట్టారు.దాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. ఆత్మగౌరవంతో జీవించడం, సమానత్వాన్ని కాపాడుకోవడం, ఎవరి ముందూ తలవంచకపోవడమే అంబేద్కర్ తమకు నేర్పిన మార్గమన్నారు. ఇలాంటి దిగజారుడు ఘటనలు తమను భయపెట్టలేవని పేర్కొన్నారు.
తల్లిని దూషించడం అత్యంత దిగజారుడుతనం
స్పీకర్‌ను, ఆయన తల్లిని కించపరుస్తూ మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అని మంత్రి దామోదర్ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుందని.. కానీ, వ్యక్తిగత దూషణలకు దిగడం, అత్యంత నికృష్టమని పేర్కొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇతరుల తల్లిని అవమానించే హక్కు కాదన్నారు. స్వేచ్ఛకు బాధ్యత, హక్కుకు హద్దు ఉండాలని హితవుపలికారు. స్పీకర్ పదవి ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదని, అది అత్యున్నత రాజ్యాంగబద్ధమైన పదవి అని గుర్తుచేశారు.
చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి, తీవ్ర కష్టాలను అధిగమించి అంచెలంచెలుగా ఎదిగి స్పీకర్‌గా ఉన్నత స్థానానికి చేరిన గడ్డం ప్రసాద్ కుమార్ వంటి గొప్ప వ్యక్తిని అవమానించడం బాధాకరమన్నారు. ఆయన ఎదుగుదల కేవలం ఒక వ్యక్తిది మాత్రమే కాదని, ఒక సామాజిక వర్గం సాధించిన విజయమని, రాజ్యాంగం కల్పించిన సమానత్వానికి ప్రతీక అని కొనియాడారు. ఘటన జరిగి 30 గంటలు గడిచినా కనీస పశ్చాత్తాపం, క్షమాపణ లేకపోవడం వారి సంస్కారహీనతకు నిదర్శనమన్నారు.
