ఎస్టీల నిధులు వారికే ఖర్చు చేస్తం

ఎస్టీల నిధులు వారికే ఖర్చు చేస్తం
  • ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్‌‌‌‌లో మంత్రులు అడ్లూరి, సీతక్క
  • సబ్ ప్లాన్ ఫండ్స్ ఇతర స్కీంలకు డైవర్ట్ చేయమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్టీల నిధులు.. వారి సంక్షేమానికే ఖర్చు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత పదేండ్లు గిరిజనుల విషయంలో, వారి స్కీమ్‌‌‌‌ల అమల్లో లోపాలను సరిదిద్దుతామని తెలిపింది. సోమవారం హైదరాబాద్‌‌‌‌ మసాబ్ ట్యాంక్‌‌‌‌లోని సంక్షేమ భవన్‌‌‌‌లో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్(టీఏసీ) 7వ సమావేశం ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి, చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగింది. ఈ మీటింగ్‌‌‌‌కు మంత్రి సీతక్క, ఎస్టీ ఎంపీలు నగేశ్‌‌‌‌, బలరాం నాయక్, డిప్యూటీ స్పీకర్ రాంచంద్రునాయక్, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర, రాష్ట్ర ట్రైబల్ శాఖ సెక్రటరీ శరత్, ఆర్ అండ్ బీ స్సెషల్ సీఎస్ వికాస్ రాజ్, హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్‌‌‌‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఇందిర సౌర గిరి వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్టీ ప్రాంతాల్లో రోడ్లు, కరెంట్, ఫారెస్ట్ అంశాలు, స్కాలర్ షిప్‌‌‌‌లు, హాస్టల్స్ ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఐదేండ్ల తర్వాత గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశామని, గత ప్రభుత్వం ఈ మీటింగ్‌‌‌‌ను పూర్తిగా విస్మరించిందన్నారు. 

అదనపు నిధుల మంజూరుకు కృషి: మంత్రి సీతక్క

ఎస్టీలకు సబ్ ప్లాన్ ఫండ్స్‌‌‌‌తో పాటు సీఎంతో చర్చించి అదనంగా నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తామని పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క అన్నారు. గత ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ఎస్టీ నియోజకవర్గాల్లో రోడ్లు, బ్రిడ్జిలు అవసరం ఉందని, గత పదేండ్లు ఈ అంశాల్లో నిర్లక్ష్యం చేయడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఎస్టీలకు కేటాయించిన నిధులను అదే అసెంబ్లీ సెగ్మెంట్​లో, అదే జిల్లాలో సర్దుబాటు చేయాలి తప్ప మైదాన ప్రాంతాలకు తరలించొద్దన్నారు. 

పలు తీర్మానాలకు ఆమోదం.. 

ఏడవ గిరిజన సలహా మండలి సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. సామాజిక అటవీ హక్కులు.. పోడు పట్టాల పంపిణీపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. నాయకపోడులను ప్రత్యేక ట్రైబ్‌‌‌‌గా గుర్తించాలి. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజన సొసైటీలకు లబ్ధి చేకూరేలా సాండ్ మైనింగ్ విధానంలో మార్పులు. 18 జిల్లాల్లో నూతనంగా జిల్లా ట్రైబల్ అధికారి పోస్టుల మంజూరు.