జూబ్లీహిల్స్ అసంతృప్తులకు మీనాక్షి నటరాజన్, మంత్రులు వివేక్, పొన్నం బుజ్జగింపులు

జూబ్లీహిల్స్  అసంతృప్తులకు మీనాక్షి నటరాజన్, మంత్రులు వివేక్, పొన్నం  బుజ్జగింపులు

 

  • జూబ్లీహిల్స్​ టికెట్ దక్కనివారికి నచ్చచెప్పిన మీనాక్షి నటరాజన్, ఇన్‌‌‌‌చార్జి మంత్రులు వివేక్, పొన్నం
  • పార్టీపరంగా తగిన ప్రాధాన్యత ఉంటుందని అంజన్ కుమార్​ యాదవ్, సీఎన్ రెడ్డికి హామీ

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కని అసంతృప్తులను బుజ్జగించడంపై ఆ పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మీనాక్షి నటరాజన్, నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి శుక్రవారం అసంతృప్త నేతల ఇళ్లకు వెళ్లి.. వారిని బుజ్జగించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును హైకమాండ్ ప్రకటించడంతో.. చివరి వరకు టికెట్ ప్రయత్నించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అలకబూనారు. మరో ఆశావహుడైన కార్పొరేటర్ సీఎన్ రెడ్డి కూడా ఇంటికే పరిమితం అయ్యారు. 

ఈ విషయం తెలుసుకున్న మీనాక్షి నటరాజన్.. మొదటగా ఆదర్శనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో ఉన్న అంజన్ కుమార్​ యాదవ్‌‌‌‌‌‌‌‌ వద్దకు  మంత్రులు వివేక్, పొన్నంను  పంపించారు. ఆ వెంటనే ఆమె కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ అంజన్‌‌‌‌‌‌‌‌ కుమార్ యాదవ్‌‌‌‌‌‌‌‌తో గంటకుపైగా సమావేశమయ్యారు. నవీన్ యాదవ్‌‌‌‌‌‌‌‌కు టికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే విషయాన్ని ఆయనకు వివరించారు. రాబోయే రోజుల్లో పార్టీపరంగా కల్పించనున్న ప్రాధాన్యతపై అంజన్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నేతలు భరోసా ఇచ్చారు. తిరిగి పార్టీ ప్రచారంలో పాల్గొనేలా ఆయన్ను ఒప్పించారు. ఆ తర్వాత రెహమత్‌‌‌‌‌‌‌‌నగర్​ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఇంటికి మంత్రులు వివేక్, పొన్నంతో పాటు ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ వెళ్లారు. టికెట్ ఎంపికలో పార్టీ ప్రాధాన్యత, రాబోయే రోజుల్లో ఆయనకు కల్పించనున్న రాజకీయ భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు. మీనాక్షి నటరాజన్, మంత్రులు వివేక్, పొన్నం మీడియాతో మాట్లాడారు.

అసంతృప్తి వీడారు: మీనాక్షి నటరాజన్

కాంగ్రెస్  తీసుకున్న కొన్ని నిర్ణయాలు నేతలను బాధ కలిగించొచ్చని, కానీ పార్టీకి ఏది మేలు చేస్తుందో ఆ నిర్ణయమే హైకమాండ్ తీసుకుంటుందని మీనాక్షి నటరాజన్ తెలిపారు. అంజన్ కుమార్ అసంతృప్తి వీడారని చెప్పారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

ఆయన ఆధ్వర్యంలోనే ప్రచారానికి..: మంత్రి పొన్నం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలోనే సాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఆయన పనిచేసి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లాంటి పెద్దసిటీలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు పెద్ద దిక్కుగా నిలిచారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని భావించారని, కానీ అక్కడున్న పరిస్థితులను బట్టి నవీన్ యాదవ్‌‌‌‌‌‌‌‌కు పార్టీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. అంజన్‌‌‌‌‌‌‌‌ కుమార్​ యాదవ్‌‌‌‌‌‌‌‌ సేవలను పార్టీ వినియోగించుకుంటుందని తెలిపారు.

అంజన్‌‌‌‌కుమార్ సేవలకు గుర్తింపు ఉంటది: మంత్రి వివేక్

అంజన్ కుమార్ యాదవ్ పార్టీకి చేస్తున్న సేవలను హైకమాండ్ తప్పక గుర్తించి, సరైన ప్రాధాన్యత ఇస్తుందని  మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఆయన 2 సార్లు ఎంపీగా పనిచేశారని, హైదరాబాద్, సికింద్రాబాద్‌‌‌‌లో ఆయన సేవలు కాంగ్రెస్‌‌‌‌కు అవసరమని అన్నారు. సిటీలో కాంగ్రెస్ బలోపేతానికి అంజన్‌‌‌‌ కుమార్​ యాదవ్‌‌‌‌ ఎంతగానో కృషి చేశారని చెప్పారు. జూబ్లీహిల్స్ టికెట్ రాకపోవడంతో ఆయన బాధపడ్డ విషయం వాస్తవమేనని, అయితే ఆయన సేవలను ఏ రకంగా వినియోగించుకోవాలో హైకమాండ్‌‌‌‌కు తెలుసని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని అంజన్ చెప్పారని, అందుకోసమే ఆయన ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తారని తెలిపారు.