దేశ వ్యాప్త ఓబీసీ గణనే  బాపూజీకి అసలైన నివాళి

దేశ వ్యాప్త ఓబీసీ గణనే  బాపూజీకి అసలైన నివాళి
  • సాయుధ పోరు నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు..
  • కొండా లక్ష్మణ్​ బాపూజీ మార్గం అనుసరణీయం
  • 111వ జయంతి సభలో మంత్రి వివేక్ వెంకటస్వామి
  • పదవుల కన్నా ప్రజల ఆకాంక్షే ముఖ్యమన్న ఆదర్శ నేత
  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఐదుగురు పద్మశాలీలు ఎమ్మెల్యేలుగా గెలవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా సమగ్ర కుల గణన చేపట్టి బడుగు, బలహీన వర్గాలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం చేసినప్పుడే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి అసలైన నివాళి అని మంత్రులు పొన్నం ప్రభాకర్, డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌ రవీంద్రభారతిలో ఆదివారం ఘనంగా నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకల్లో మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, బహుజనుల రాజకీయ సాధికారత కోసం నాడు అధికార పీఠాలనే 
తృణప్రాయంగా వదిలేసిన మహోన్నత త్యాగశీలి బాపూజీ అని కొనియాడారు.  

నిజాం నిరంకుశ పాలనపై సాయుధ పోరాటం మొదలుకొని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఢిల్లీ వేదికగా ఆమరణ దీక్షల వరకు బాపూజీ సాగించిన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని  పేర్కొన్నారు. అణగారిన వర్గాల సంక్షేమం, చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం బాపూజీ వేసిన బాటలోనే ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. బహుజన సమాజం ఐక్యంగా ఉండి రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. 

పద్మశాలీల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు కావాలి: పొన్నం ప్రభాకర్​

తెలంగాణ ప్రజల ఆకాంక్షల ముందు రాజకీయ భవిష్యత్తు, మంత్రి పదవులు ఏమాత్రం ముఖ్యం కాదని నిరూపించిన నిఖార్సయిన నాయకుడు బాపూజీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాడు పార్లమెంటులో ఎంపీలుగా తాము కొట్లాడినప్పుడు ఆయన తెగువే తమకు గొప్ప స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. వెట్టిచాకిరీ, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన ఆశయాలకు అనుగుణంగా చేనేత కార్మికుల, నేతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తులు మారాలని, బలహీన వర్గాలు రాజకీయంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. నిన్న యాదవ, ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనాలు జరిగితే, ఇయ్యాల పద్మశాలీల ఐక్యత కనిపిస్తోందని.. రాబోయే ఎన్నికల్లో కనీసం ఐదుగురు పద్మశాలి ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పొన్నం ఆకాంక్షించారు.

రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో కుల గణన చేపట్టి చట్టం చేస్తే, 50 శాతం పరిమితి దాటాలంటే జాతీయ స్థాయి ప్రామాణిక డేటా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం, కోర్టుల నిబంధనలు అడ్డంకిగా మారాయన్నారు. కేంద్రం 2025 ఏప్రిల్ 1 నుంచి చేపట్టే జనగణనలో కుల గణన చేస్తామని చెప్పి, చివరకు కాలమ్ 10లో ఎస్సీ, ఎస్టీలను మాత్రమే అడిగి బీసీల ప్రస్తావన లేకుండా కేవలం క్యాస్ట్ మాత్రమే పెట్టడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కేంద్రం కుట్రలు మాని, దేశవ్యాప్తంగా సమగ్రంగా కుల గణన నిర్వహించాలని డిమాండ్ చేశారు.  

బీసీలు ఐక్యంగా పోరాడాలి: వివేక్ వెంకటస్వామి 

హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా వెనుకాడని ధీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, యావత్ బీసీ సమాజానికి ఆయన ఎప్పటికీ వెలకట్టలేని రోల్ మోడల్ అని శక్తి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి జి. వెంకటస్వామికి బాపూజీ అత్యంత ఆప్తమిత్రుడని, వారిద్దరి మధ్య ఉన్న ఉద్యమ సాన్నిహిత్యం ఎంతో గొప్పదని స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో, 92 ఏళ్ల పండు వృద్ధాప్యంలోనూ లెక్కచేయకుండా ఢిల్లీకి తరలివచ్చి జంతర్ మంతర్ వేదికపై నిరాహార దీక్ష చేపట్టి బాపూజీ చూపిన నిబద్ధత ఉద్యమకారుల్లో నూతనోత్తేజాన్ని నింపిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తన భూమి సమస్యపై పోలీసులు అక్రమంగా ప్రవేశించినప్పుడు సైతం, అదే 92 ఏళ్ల వయసులో వెరవకుండా హైకోర్టు మెట్లెక్కి వాదించి న్యాయం కోసం నిలబడ్డ అపర యోధుడని కొనియాడారు.

ఉమ్మడి ఆదిలాబాద్ ముద్దుబిడ్డ అయిన బాపూజీ సేవలను చిరస్మరణీయం చేసేందుకే హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి, ఆసుపత్రికి ఆయన పేరును పెట్టి ప్రభుత్వం సముచిత రీతిలో గౌరవించిందని వివేక్ చెప్పారు. ప్రస్తుతం బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా శ్రమిస్తున్నారని, బాపూజీ ఆశయ సాధన కోసం బహుజనులంతా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే నాగరాజు, కార్పొరేషన్ల చైర్మన్లు దూడం వెంకటరమణ, గూడూరి శ్రీనివాస్, అనిల్ ఈరవర్తి, మెట్టు సాయికుమార్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్‌‌‌‌తో పాటు పలువురు బీసీ మేధావులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.