
GST Reforms: కేంద్ర మంత్రుల బృందం తాజాగా జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా 12 శాతం, 28 శాతం స్లాబ్ పన్ను రేట్లను తొలగించటానికి ఆమోదించింది. దీంతో ప్రస్తుతం ఉన్న జీఎస్టీ పన్ను స్లాబ్స్ రానున్న కాలంలో రెండుకు తగ్గనున్నాయి. ఇప్పటి వరకు 5%, 12%, 18%, 28% స్లాబ్స్ కింద వివిధ వస్తువులపై జీఎస్టీ వసూళ్లు జరుగుతుండగా.. తొలగింపు తర్వాత 5 శాతం, 18 శాతం స్లాబ్స్ మాత్రమే భవిష్యత్తులో అవకాశం ఉందని వెల్లడైంది. ఈ మార్పులకు ఆరుగురు మంత్రులతో ఏర్పాటు చేసిన బృందం తాజాగా అంగీకారాన్ని తెలిపింది. 12%, 28% జీఎస్టీ స్లాబ్‌లను తొలగించాలనే కేంద్రం ప్రతిపాదనను ఆమోదించిన మంత్రుల బృందం అంగీకారం తెలపగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన సెప్టెంబర్ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో సిఫార్సులను ఉంచనున్నట్లు వెల్లడైంది.
ALSO READ : దేశంలోనే రిచ్చెస్ట్ జిల్లా మన రంగారెడ్డి
ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోడీ జీఎస్టీ సంస్కరణల గురించి కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనపై కొన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు కూడా ఎదురవుతున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం తాము జీఎస్టీ కౌన్సిల్ కు స్లాబ్స్ రద్దు గురించి కేవలం రికమెండేషన్ చేశామని దానిపై తుదినిర్ణయం జీఎస్టీ కమిటీ చేతిలోనే ఉంటుందని మంత్రుల బృందాన్ని లీడ్ చేస్తున్న చౌదరి వెల్లడించారు.
అలాగే మంత్రుల బృందం ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ కింద ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలని కూడా చర్చించిందని వెల్లడైంది. అలాగే రానున్న కాలంలో లగ్జరీ వస్తువులు, లగ్జరీ కార్లు వంటి వాటి కోసం ప్రత్యేకంగా 40 శాతం పన్ను రేటు కింద జీఎస్టీ వసూలు చేస్తారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న సమయంలో తాజా ప్రకటన వచ్చింది. జీఎస్టీ స్లాబ్స్ రద్దుకు అంగీకరించిన మంత్రుల బృందంలో ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా, రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య, కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడ, కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ ఉన్నారు.