
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం వేగంగా వృద్ధి చెందుతోందని తాజా డేటా చెబుతోంది. అయితే ఈ అభివృద్ధికి కేంద్రంగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా భారీగా కాంట్రిబ్యూట్ చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో దేశంలోని సంపన్న జిల్లాల జాబితాలో గురుగ్రామ్ ను మెుదటి స్థానం నుంచి వెనక్కు నెట్టేసి తొలి స్థానంలో దూసుకుపోతోంది రంగారెడ్డి. తాజా డేటా ప్రకారం రంగారెడ్డి జిల్లా నుంచి తలసరి జీడీపీ రూ.11లక్షల 46వేలుగా ఉన్నట్లు వెల్లడైంది.
ప్రధానంగా ప్రపంచ ఐటీ సంస్థలకు సరికొత్త డెస్టినేషన్ గా రంగారెడ్డి జిల్లా మారటం రూపురేకలను మార్చేస్తోందని తేలింది. దీనికి తోడు జిల్లాలో ఉన్న ఫార్మా రంగం, టెక్ పార్క్స్ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయని తేలింది. ఈ అభివృద్ధి కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తూ ప్రజలకు ఉపాధి అవకాశాలను పెంచుతోంది. రోజురోజుకూ కొత్త కంపెనీల రాక దేశం నలుమూలల నుంచి రంగారెడ్డి జిల్లాకు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మైగ్రేషన్ కి దారితీసినట్లు తేలింది.
తొలిస్థానంలో రంగారెడ్డి విజయ పరంపరతో ముందుకు సాగుతుండగా.. గురుగ్రామ్, బెంగళూరు, నోయిడా వంటి నగరాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే గురుగ్రామ్, బెంగళూరు ప్రధానంగా స్టార్టప్ ఎకోసిస్టమ్ వృద్ధిలో భాగస్వాములుగా మారుతున్నాయని వెల్లడైంది.
ALSO READ : ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఎఫెక్ట్
దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రూపాంతరం చెందిన రంగారెడ్డి జిల్లా దేశ ఆర్థిక పురోభివృద్ధిలో వస్తున్న మార్పులను హైలైట్ చేస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఈ జిల్లా ఎలా ముందుకు సాగుతుంది.. ఎలాంటి కొత్త మార్పులకు వ్యాపార అవకాశాలకు కేంద్రంగా మారుతుందనే అంశంపై చాలా మంది దృష్టి సారిస్తున్నారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడంపై ప్రాధాన్యత వారి పోటీతత్వాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. ఆర్థిక సర్వే 2024-25 నుండి వచ్చిన ఈ తాజా డేటా తెలంగాణ జిల్లా మెుదటి స్థానంలో నిలవటం టెక్నాలజీతో పాటు వ్యూహాత్మక పెట్టుబడుల ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది.