ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఎఫెక్ట్: 300 కంపెనీలు క్లోజ్.. ప్రమాదంలో 2 లక్షల ఉద్యోగులు!

ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఎఫెక్ట్: 300 కంపెనీలు క్లోజ్.. ప్రమాదంలో 2 లక్షల ఉద్యోగులు!

భారత లోక్‌సభలో ఇటీవల ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ (RMG) పై కొత్త బిల్లు ఆమోదించబడింది. దీంతో ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ బిల్లుతో పరిశ్రమకు తీవ్రమైన సవాళ్లు ఎదురుకానున్నాయని.. ఏకంగా ఉనికికే ముప్పు ఏర్పడుతుందని గేమింగ్ సంస్థలు ఆదోళన చెందుతున్నాయి. అయితే బిల్లు వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయం గురించి తెలుసుకుందాం.. 

కొత్తగా ఆమోదించబడిన బిల్లుతో దేశంలోని సుమారు 300 గేమింగ్ కంపెనీలు మూతపడే అవకాశం ఉందని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ చెబుతోంది. దీనివల్ల సుమారు 2 లక్షల ఉద్యోగాలు నష్టపోయే ప్రమాదం ఉందని తేలింది. ముఖ్యంగా చిన్న స్టార్టప్ కంపెనీలతో పాటు అభివృద్ధి దశలో ఉన్న గేమింగ్ సంస్థలు ఈ ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుందని గేమింగ్ రంగ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఈ రంగంలో సుమారు రూ.25వేల కోట్ల పెట్టుబడులు ఉన్నాయని అంచనా. బిల్లు అమల్లోకి వస్తే ఈ పెట్టుబడులు వృథా అయ్యే అవకాశముంది. ఆన్ లైన్ గేమింగ్ ఇండస్ట్రీ ద్వారా ఏటా ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం రూపంలో రూ.20వేల కోట్లు సమకూరుతోంది. ఇది పరోక్షంగా ఆ రంగంలోని కంపెనీల ఆదాయం దెబ్బతినటానికి కారణంగా మారుతుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. 

చట్టబద్ధమైన గేమింగ్ కంపెనీలను నియంత్రిస్తే.. ఆటగాళ్లు ఇతర మార్గాలు వెతుకుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ఫలితంగా వారు విదేశీ అక్రమ వెబ్ సైట్లు, బెట్టింగ్ యాప్స్ ఉపయోగించే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. ఇది సైబర్ సెక్యూరిటీతో పాటు వినియోగదారుల రక్షణలో కూడా సమస్యలు సృష్టించే అవకాశాలను పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశీయ కంపెనీలు కష్టాల్లో పడితే, విదేశీ గేమ్ ఆపరేటర్లు ఈ పరిస్థితిని మంచి అవకాశంగా మార్చుకుని లాభపడతారని చెబుతున్నారు నిపుణులు. ఇది దాదాపు రూ.35వేల కోట్ల రాబడి నష్టాలకు దారితీస్తుందని అంచనాలు ఉన్నాయి.  

ALSO READ : గేమింగ్ బిల్లుకు లోక్ సభ ఆమోదం

కొత్త బిల్లుతో కేవలం గేమింగ్ పరిశ్రమ మాత్రమేకాకుండా.. భారత క్రీడా రంగంపై కూడా ప్రభావం పడనుంది. ప్రస్తుతం అనేక ఫ్రాంచైజీ లీగ్స్, జాతీయ స్థాయి స్పోర్ట్స్ టోర్నమెంట్స్ కి గేమింగ్ స్పాన్సర్స్ కీలకంగా ఉన్నారు. అయితే కొత్త బిల్లుతో సుమారు 50% ఫ్రాంచైజీ లీగ్స్ మూతపడవచ్చని, జట్ల స్పాన్సర్షిప్ రాబడి సుమారు 30–40% తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి కొత్తగా తెచ్చిన గేమింగ్ బిల్లు ఉద్దేశం వినియోగదారులను మోసాలను నుంచి రక్షించటంతో పాటు వారిని ఈ గేమ్స్ కి బానిసలు కాకుండా చూడటమే అని కొందరు అంటున్నారు. ఇదే సమయంలో అక్రమ మార్గాలను చాలా మంది ఎంచుకునే ప్రమాదం కూడా పెరుగుతుందనే వాదనలు ఉన్నాయి. సరైన పరిష్కారానికి ప్రభుత్వం పరిశ్రమతో చర్చించి, పారదర్శక రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్ రూపొందిస్తే మంచిదని చాలా మంది సూచిస్తున్నారు.