బీజేపీ కుట్రలు బయటపడ్తాయనే సిట్ విచారణ ఆపాలంటున్రు : హరీష్ రావు

బీజేపీ కుట్రలు బయటపడ్తాయనే సిట్ విచారణ ఆపాలంటున్రు : హరీష్ రావు

ఎమ్మెల్యేల కొనుగోళ్లలో బీజేపీ పట్టపగలే పట్టుబడిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీజేపీ నేతలు సిట్ విచారణ ఆపాలని కోర్టుకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. ఈ కేసులో పట్టుబడిన వాళ్లతో తమకు సంబంధం లేదన్న బీజేపీ.. కోర్టులకు ఎందుకు వెళ్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని విమర్శించారు. బీజేపీ కుట్రలు బట్టబయలవుతాయనే విచారణ ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 
 
‘‘ఎమ్మెల్యేల కొనుగోళ్లతో తమకు సంబంధం లేదని బీజేపీ అధ్యక్షుడు ప్రమాణం చేస్తాడు. ప్రధాన కార్యదర్శి విచారణ ఆపాలని కోర్టులో కేసు వేస్తాడు. ఇది బీజేపీ వైఖరి. బీజేపీ నేతల వైఖరి చూస్తుంటే ఏదో ఉందని అర్థమవుతోంది’’ అని హరీష్ రావు అన్నారు. తెలంగాణ పోలీసులపై బీజేపీ నేతలకు విశ్వాసం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసులపై విశ్వాసం లేకపోతే రాష్ట్ర ప్రజలను ఓట్లు ఎందుకు అడుగుతున్నారని నిలదీశారు.  బీజేపీ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనించాలన్న మంత్రి.. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విచారణకు సహకరించాలని సూచించారు. 

గవర్నర్ తమిళసై అంశంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ‘‘ రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నవారు పద్ధతిగా మాట్లాడాలి. మేము మాట్లాడితే అంతకంటే ఎక్కువగా మాట్లాడుతాం. కానీ మేము అలా మాట్లాడం’’ అని అన్నారు. పెగాసస్ ఎవరు వాడుతున్నారనేది దేశం అంతా తెలుసు అని వ్యాఖ్యానించారు. 

బీజేపీ అనైతిక రాజకీయాలు చేస్తోంది : నిరంజన్ రెడ్డి 

బీజేపీ అనైతిక రాజకీయాలు చేస్తోందని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు.  బీజేపీ నేతలు సిట్ విచారణ ఆపాలనడం సిగ్గుచేటని.. ఏ సంబంధం లేకుంటే కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటున్నారన్న మంత్రి.. బీజేపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.