సొంత నియోజకవర్గాల్లోనే మంత్రులు!

సొంత నియోజకవర్గాల్లోనే  మంత్రులు!
  • పక్క సెగ్మెంట్ల వైపు కన్నెత్తి చూడని లీడర్లు
  • గెలిచి తీరాలనే లక్ష్యంతో ప్రయత్నాలు
  • అవసరమైతే తప్ప హైదరాబాద్​కు రావట్లే

హైదరాబాద్, వెలుగు:  మంత్రులు సొంత నియోజకవర్గాలు వీడి బయటకు రావట్లేదు. అభ్యర్థుల ప్రకటన తర్వాత పూర్తిగా సెగ్మెంట్లకే పరిమితమయ్యారు. ఎప్పుడో ఒకసారి తప్ప పక్క నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడటంలేదు. హైదరాబాద్​లోనూ అరుదుగానే కనిపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే లక్ష్యంతో గ్రౌండ్​లోనే పని చేసుకుంటున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు జిల్లాల పర్యటనకు వెళ్తే తప్ప.. ఉమ్మడి జిల్లాల్లోనూ మంత్రులు కనిపించడంలేదు. తాము గట్టెక్కేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. మంత్రి వర్గంలో సీఎం కేసీఆర్ సహా 18 మంది మంత్రులుండగా ఇందులో ముగ్గురు మండలి సభ్యులు. కేటీఆర్, హరీశ్ రావు మాత్రమే రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. వికారాబాద్  జిల్లా అభ్యర్థులను గెలిపించేందుకు మహేందర్​రెడ్డి పనిచేస్తున్నారు.

కాంగ్రెస్ పుంజుకోవడమూ కారణమే..

ఆగస్టు 21న 115 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. దీనికంటే కొన్ని నెలల ముందు నుంచే మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం సెగ్మెంట్ దాటి బయటకు రాలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉండటంతోనే ఆయన నియోజకవర్గం వదిలి బయటకు రావడంలేదని సొంత పార్టీ నేతలు చెప్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అభ్యర్థుల ప్రకటనకు ముందు నుంచే నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ప్రగతి భవన్​లో ఎక్కువ.. నియోజకవర్గంలో ఎప్పుడో ఒకసారి కనిపించే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు బాల్కొండ సెగ్మెంట్​కే పరిమితం అయ్యారు. పోయిన సారి స్వల్ప ఓట్లతో గెలిచిన కొప్పుల ఈశ్వర్ కూడా ధర్మపురి నియోజకవర్గం దాటి బయట అడుగు పెట్టడం లేదు. కరీంనగర్​కు గంగుల కమలాకర్, నిర్మల్​కు ఇంద్రకరణ్ రెడ్డి, మహబూబ్​నగర్​కు శ్రీనివాస్ గౌడ్ పరిమితం అయ్యారు. నిరంజన్ రెడ్డి కూడా తన నియోజకవర్గం వనపర్తిపైనే ఫోకస్ పెట్టారు.

ఉమ్మడి జిల్లాలు పట్టించుకోని మంత్రులు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి సైతం తమ నియోజకవర్గాల్లోనే ఎక్కువ టైమ్ గడుపుతున్నారు. ఉమ్మడి నల్గొండ రాజకీయాల్లో అన్నీ తానై పని చేసే మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేటకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తన ముఖ్య అనుచరులు పార్టీకి దూరమవడం, జిల్లాలో కాంగ్రెస్ బలం పెరిగినట్టు సర్వే రిపోర్టులు చెప్తుండటంతో హ్యాట్రిక్ కొట్టాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ, గణేశ్ ఉత్సవాలు సహా ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే సనత్​నగర్​పైనా ఫోకస్ పెట్టారు.