నల్గొండ, వెలుగు: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అమలులో నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే టాప్లో నిలిపేలా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం నల్గొండలోని ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా అధికారుల సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 10 ముఖ్య అంశాలపై దృష్టి సారించాలని, కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పెండింగ్ బిల్లులను సోమవారంలోపు క్లియర్ చేస్తామని, ఏప్రిల్ నుంచి కొత్త విడత ఇండ్లను మంజూరు చేస్తామని వెల్లడించారు.
అలాగే, 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు అందిస్తామని, మూసీ నదిని తప్పక ప్రక్షాళన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను అర్హులైన పేద ప్రజలకు చేరవేసే పూర్తి బాధ్యత అధికారులదేనని జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశామని, రోజూ జరిగిన పనులపై నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు నెలలో 15 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ఉంటూ పనులను పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ప్రజా పాలన పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని, సోలార్ విద్యుత్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీలు నెల్లికంట సత్యం, శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బాలు నాయక్, మందుల సామేలు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, నల్గొండ మేయర్ చైతన్య బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్లు బి. చంద్రశేఖర్, తేజస్ నంద్ లాల్ పవార్, అనురాగ్ జయంతి, నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొన్నారు.
ప్రభుత్వ లక్ష్యాలను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
కందనూలు/ఆమనగల్లు : నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం తెల్కపల్లి మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడ నెలకొన్న అపరిశుభ్రతపై వైద్య సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, వంట కోసం కట్టెల పొయ్యికి బదులు త్వరలోనే సిలిండర్లు అందజేస్తామని తెలిపారు.
ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మరోవైపు ఆమనగల్లులో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ 99 రోజుల ప్రగతి ప్రణాళికతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
