- పట్టు బట్టలు పెట్టనున్న మంత్రులు పొన్నం, సురేఖ
- పక్కాగా ఏర్పాట్లు కనుల పండువగా ఎదుర్కోలు ఉత్సవం
- రేపు రథోత్సవం .. రెండు రోజులు ట్రాఫిక్ మళ్లింపులు
పద్మారావునగర్, వెలుగు: ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో మంగళ, బుధవారాల్లో అమ్మవారి కల్యాణోత్సవంతో పాటు రథోత్సవం నిర్వహించనున్నారు. సోమవారం అమ్మవారి ఎదుర్కోలు కనుల పండువగా నిర్వహించారు. మంగళవారం ప్రధాన వేడుక అయిన అమ్మవారి కల్యాణోత్సవం, బుధవారం సాయంత్రం అమ్మవారి రథోత్సవం నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరఫున జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టుబట్టలు పెట్టనున్నారు. కల్యాణోత్సవం కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రంగులు వేయడం, వేదిక అలంకరణ, ఇతర ఏర్పాట్లన్నీ కంప్లీటయ్యాయి. భారీ షెడ్లు, క్యూలైన్లు నిర్మించారు. భక్తులకు నిరంతర తాగునీటి సరఫరాతో పాటు నిమిషం కూడా కరెంట్ పోకుండా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి దాదాపు 8 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో వారి రక్షణ కోసం వందలాది సీసీ కెమెరాలను, పోలీసులను బందోబస్తుకు సిద్ధం చేశారు. మంగళవారం కల్యాణం తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ట్రాఫిక్‌జామ్స్, ఇతర సమస్యలు లేకుండా రెండు రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు ప్రకటించారు.
మళ్లింపు మార్గాలు ఇవే..
గ్రీన్ ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ వైపు నుంచి బల్కంపేట ఆలయం, ఫతేనగర్ ఫ్లైఓవర్ వైపు వెళ్లే వాహనాలను ఎస్ఆర్ నగర్ టీ జంక్షన్ వద్ద ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకే గూడ ఎక్స్ రోడ్, శ్రీరామ్ నగర్ ఎక్స్ రోడ్ మీదుగా సనత్‌నగర్, ఫతేనగర్ రోడ్ వైపు మళ్లిస్తారు. ఫతేనగర్ ఫ్లై ఓవర్ నుంచి బల్కంపేట ఆలయం వైపు వచ్చే వాహనాలను హైదరాబాద్ కిచెన్ మార్ట్ వద్ద ఆర్‌యూబీ ద్వారా కట్టమైసమ్మ ఆలయం, బేగంపేట వైపు పంపిస్తారు. గ్రీన్ ల్యాండ్స్, బకుల్ అపార్ట్‌మెంట్స్, ఫుడ్ వరల్డ్ నుంచి బల్కంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఫుడ్ వరల్డ్ ఎక్స్ రోడ్స్ వద్ద సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రీవనం, ఎస్ఆర్ నగర్ వైపు పంపిస్తారు. బేగంపేట, కట్టమైసమ్మ ఆలయం వైపు నుంచి బల్కంపేట టెంపుల్వెళ్లే వాహనాలను బేగంపేట ఫ్లైఓవర్, మాతా టెంపుల్, సత్యం థియేటర్, మైత్రీవనం ద్వారా గ్రీన్ ల్యాండ్స్ వైపు అనుమతిస్తారు. ఎస్ఆర్ నగర్ టీ జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు ఉన్న ఉప-సందులు, లింక్ రోడ్లను పూర్తిగా మూసివేశారు.
పార్కింగ్ స్థలాలివే..
భక్తుల వాహనాల కోసం ఆర్అండ్బీ ఆఫీస్, జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, పద్మశ్రీ అపార్ట్‌మెంట్స్ (డీకే రోడ్ నుంచి నేచర్ క్యూర్ హాస్పిటల్ రోడ్డు వైపు), ఫతేనగర్ అండర్ బ్రిడ్జి, నేచర్ క్యూర్ హాస్పిటల్, సనత్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ ప్లే గ్రౌండ్లలో పార్కింగ్ వసతి కల్పించారు. అత్యవసర ప్రయాణ సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించాలని కోరారు.
