వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితేనే అభ్యున్నతి: మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర

వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితేనే అభ్యున్నతి: మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర

 ఉమ్మడి రాష్ట్రంలోనే పటాన్‌చెరు అతిపెద్ద పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందిందని గుర్తు చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు  రాష్ట్ర పారిశ్రామిక విజన్‌ను వివరించారు. తొగర్‌పల్లిలో భారీ పరిశ్రమ ఏర్పాటు కావడానికి TGIIC చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి  కారణమని ఆయన కొనియాడారు. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 1500 మంది మహిళలకు ఉపాధి లభించడం శుభపరిణామమని, ఇది పూర్తిగా కాలుష్య రహిత పరిశ్రమ అని ఆయన పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంతర్జాతీయ సదస్సుల ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ పేరుతో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా పని చేస్తున్నామని... 2047 నాటికి దేశ జాతీయ ఉత్పత్తిలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచుతామని ధీమా వ్యక్తం చేశారు. జహీరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని మంత్రులు పునరుద్ఘాటించారు.