
- మంత్రి వెంకట్‌రెడ్డి, హరీశ్ నడుమ వాడీవేడి చర్చ
- హాఫ్ నాలెడ్జ్ వ్యాఖ్యలపై రభస
హైదరాబాద్, వెలుగు: బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, కాంగ్రెస్ మంత్రుల నడుమ మాటల తూటాలు పేలాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో అసెంబ్లీ దద్దరిల్లింది. కాంగ్రెస్హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తిస్థాయిలో ఎందుకు అమలుకావడం లేదని హరీశ్‌రావు ప్రశ్నిస్తే.. తమ ప్రభుత్వం వచ్చి 7 నెలలే అయిందని, ప్రాధాన్యతా క్రమంలో ఒక్కో హామీ అమలు చేస్తున్నామని, కానీ బీఆర్ఎస్ఇచ్చిన అనేక హామీలు పదేండ్లలో ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని మంత్రులు నిలదీశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరుతో అన్నీతానై బీఆర్ఎస్ తరఫున చర్చను కొనసాగించిన హరీశ్‌రావుకు సందర్భాన్ని బట్టి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి , మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీటైన సమాధానాలు చెప్పారు.
కరెంట్‌పై గన్‌పార్క్ వద్ద చర్చిద్దాం: హరీశ్‌రావు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వస్తే.. రాష్ట్రంలో కరెంట్ ఎలా ఉందో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద ప్రజలతో చర్చపెడుదామని హరీశ్‌రావు అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంట్ సరఫరా బాగుందా? 8 నెలల కాంగ్రెస్ పాలనలో బాగుందా? అని ప్రజలనే ప్రశ్నిద్దామన్నారు. తమ పార్టీలో ఉండి వెళ్లిన కేకే ఇంటికి సీఎంహోదాలో రేవంత్ రెడ్డి వెళ్లినప్పుడు కరెంట్ పోయిందని తెలిపారు. ఇదే అంశాన్ని అన్ని పత్రికలు ప్రధాన శీర్షికలో ప్రచురించాయని పేర్కొన్నారు.
పదేండ్లలో ఆర్థిక విధ్వంసం చేశారు: భట్టి
హరీశ్‌రావు తన ప్రసంగంలో బడ్జెట్లో పథకాలపై చేసిన విమర్శలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిప్పికొట్టారు. గత బీఆర్ఎస్ సర్కారు పదేండ్లలో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారని చెప్పారు. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను ఇప్పుడిప్పుడే తాము దారికి తెస్తున్నామని, రాష్ట్రాన్ని బాగు చేసే బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని, ఇది బీఆర్ఎస్ నేతలకు కంటగింపుగా ఉందని అన్నారు. తమలాగా వివిధ మార్గాల్లో నిధులు మళ్లించడం లేదే అని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్టున్నారని చురకలంటించారు.
హరీశ్‌రావు సభ సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి: మంత్రి శ్రీధర్‌బాబు
రాహుల్ గాంధీ నేతృత్వంలో రూపొందించిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ‘బీఆర్ఎస్‌కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. ఆ సంఖ్య ప్రకారం మీకొచ్చే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి’ అని హరీశ్‌రావుకు సూచించారు. ఇప్పటికే హరీశ్ గంట మాట్లాడారని అన్నారు. ఆయన సమయం అయిపోయిందని చెప్పారు. సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో మర్డర్లు పెరిగాయన్న హరీశ్ వ్యాఖ్యలకు శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. బీఆర్ఎస్ హయాంలో మిట్ట మధ్యాహ్నం నడిరోడ్డు మీద వామన్‌రావు హత్య ఉదంతాన్ని గుర్తుచేశారు.
హాఫ్ నాలెడ్జ్‌పై రభస
సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశిస్తూ హరీశ్‌రావు చేసిన హాఫ్ నాలెడ్జ్ వ్యాఖ్యలపై రభస నడిచింది. ఈ వ్యాఖ్యలపై మంత్రి వెంకట్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘‘2001లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్.. తెలంగాణ వస్తే మొట్ట మొదటి ముఖ్యమంత్రి దళితుడు అయితడు అన్నడు. దళితుడిని సీఎం చేయకపోతే మెడమీద తలతీసుకుంట అన్నడు. అబద్ధాలు అంటే వీళ్లయే. డబుల్ బెడ్ రూమ్ లో బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ పండుకోవాలే..మేకను ఎక్కడ కట్టేయాలే అన్నరు. ఆ హామీలన్నీ ఏమయ్యాయి?” అని ప్రశ్నించారు. ‘‘24 గంటల కరెంట్ ఇచ్చిన అన్నడు.. బండ్ల సోమారం అనే సబ్ స్టేషన్‌కు వెళ్లిన. 9 ఏండ్లలో ఎప్పుడూ 14 గంటల కరెంట్ రాలే అని బస్వయ్య అనే ఆపరేటర్ చెప్పిండు. దీంతో రాత్రికి రాత్రి లాగ్‌బుక్‌లు వాపస్ తెచ్చిండ్రు.. దగా, కుట్రలు టీఆర్ఎస్ పుట్టిన తర్వాతే పుట్టాయి” అని వెంకట్‌రెడ్డి విమర్శించారు. దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఎమ్మెల్యేలను కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని దుయ్యబట్టారు. “రేపు అసెంబ్లీలో చీల్చి చెండాడుతా అని కేసీఆర్ అన్నరు. ఇయ్యాల ఉదయం 9.30 గంటలకు వచ్చి కూర్చున్న. అసెంబ్లీకి వచ్చే మొఖం లేక హరీశ్‌రావును పంపిండు” అని చురకలంటించారు. హరీశ్‌రావు మనిషి పెరిగినా.. బుద్ధి పెరగలే అని ఫైర్ అయ్యారు. ‘‘హరీశ్‌రావు ఒక డమ్మీ అల్లుడు. ఆకారం పెరగంగనే కాదు బుద్ధి ఉండాలే. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మీ మామ అన్నడా? లేదా?’ అని వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. హరీశ్ స్పందిస్తూ ఇదే రేవంత్‌రెడ్డిని రూ.50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్ పదవి కొనుకున్నడు అని వెంకట్‌రెడ్డి అన్నాడని గుర్తుచేశారు. బట్టి చేసిన అంకెల గారడీ వెంకట్‌రెడ్డికి అర్థం కాలేదని, అగ్రికల్చర్ బడ్జెట్లో రూ.72 వేల కోట్లలో సాగునీటి కేటాయింపులు, విద్యుత్ సబ్సిడీ అన్ని కలిసే ఉన్నాయని తెలిపారు.
అదనపు ఆదాయం కోసం రేట్లు పెంచం: జూపల్లి
ఎక్సైజ్ అదనపు ఆదాయం కోసం తాము మద్యం రేట్లు పెంచబోమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి అన్నింటినీ స్ట్రీమ్లైన్చేస్తామని అన్నారు. జూపల్లి మాట్లాడుతుండగా.. హరీశ్ లేచి మాట్లాడారు. సభలో పదే పదే అడ్డుతగలకుండా ఉండే బాగుంటుందని జూపల్లి హితవు చెప్పారు. ‘‘నీ లిక్కర్ కథ, మద్యం లెక్కలు అన్నీ చెప్తా’ అంటూ జూపల్లిని ఉద్దేశించి హరీశ్ వ్యాఖ్యానించారు.