ఎంపీపీ, జడ్పీటీసీల మధ్య ‘మంత్రి’ చిచ్చు!

 ఎంపీపీ, జడ్పీటీసీల మధ్య  ‘మంత్రి’ చిచ్చు!
  • మండల పరిషత్​ ఆఫీసుల్లో జడ్పీటీసీలకు చాంబర్లు
  • మంత్రి, ఎమ్మెల్యేల రాజకీయ లబ్ధికి ఉమ్మడి నల్గొండలో 
  • కొత్త సంప్రదాయం 20 మండలాల్లో ఇదే సీన్​
  • జడ్పీటీసీల జోక్యాన్ని వ్యతిరేకిస్తున్న ఎంపీపీలు

నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలంలో గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సన్నిహితుడు కర్నాటి లింగారెడ్డి రెండుసార్లు జడ్పీటీసీగా, మరో రెండుసార్లు ఎంపీపీగా పని చేశారు. దీంతో ఇదే ఆఫీసులో ఎంపీపీ చాంబర్​తో పాటు అనధికారికంగా జడ్పీటీసీ చాంబర్ ఏర్పాటు చేశారు. ఈ సంప్రదాయాన్ని టీఆర్ఎస్ లీడర్లూ కొనసాగించాలని భావించారు. కానీ ఎంపీపీ ఆఫీసులో జడ్పీటీసీ చాంబర్ ఉండటానికి వీల్లేదని ప్రస్తుత ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్ రెడ్డి భర్త ఖాళీ చేయించారు. ఈ వ్యవహారం జిల్లా మంత్రి జగదీశ్​రెడ్డి వరకు వెళ్లడంతో ఆయన పర్మిషన్​ మేరకు ఓల్డ్ ఎంపీడీఓ ఆఫీసులో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి తనకు స్పెషల్​ చాంబర్ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి.

నల్గొండ, వెలుగు: పెద్దవూర మండలంలో ఎంపీపీకి పోటీగా జడ్పీటీసీకి చాంబర్​ పెట్టించడం ద్వారా మంత్రి జగదీశ్​రెడ్డి పెట్టిన చిచ్చు.. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అంతటా రాజుకుంటోంది. అన్ని మండల ఆఫీసుల్లోనూ తమకంటూ కుర్చీలు వేయించుకోవడం ద్వారా పెత్తనం చేసేందుకు జడ్పీటీసీలు చేస్తున్న ప్రయత్నాలను ఎంపీపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్టేట్​వైడ్​మండల పరిషత్​ ఆఫీసుల్లో ఎక్కడా కూడా జడ్పీటీసీలకు ప్రత్యేకంగా చాంబర్లుగానీ, కుర్చీలుగానీ లేవు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం జడ్పీటీసీలకు ప్రత్యేకంగా ఎంపీపీ బిల్డింగుల్లో రూలింగ్​ పార్టీ లీడర్లు చాంబర్లు కేటాయించడం వివాదాస్పదమవుతోంది. ఎంపీపీ ఆఫీసుల్లో ఖాళీ లేదనుకుంటే ప్రభుత్వ అద్దె భవనాల్లో చాంబర్లు ఏర్పాటు చేసుకునేందుకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పర్మిషన్​ ఇస్తున్నారు.  దీంతో ఆయాచోట్ల ఎంపీపీలు, జడ్పీటీసీలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడ్తున్నారు. శనివారం నల్గొండలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ, జడ్పీటీసీల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అధికార పార్టీకి చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు రెండు వర్గాలుగా విడిపోయి మండలాఫీసుల్లో కుర్చీ కోసం తగువు పడ్డారు. 
రాజకీయంగా చక్రం తిప్పేందుకే..
మండలాల్లో రాజకీయంగా చక్రం తిప్పేందుకు మంత్రితో పాటు ఎమ్మెల్యేలు.. తమ అనుచరులుగా ఉన్న జడ్పీటీసీలకు మండల పరిషత్​ ఆఫీసుల్లో ప్రత్యేక చాంబర్లు కేటాయించేలా చూస్తున్నారు.  ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాలో 31 మండలాలకుగాను దాదాపు 20 మండలాల్లోని ఎంపీపీ ఆఫీసుల్లో జడ్పీటీసీలకు ప్రత్యేక చాంబర్లు  ఏర్పాటు చేశారు. నిజానికి రూల్ ప్రకారం మండలాల్లో జడ్పీటీసీలకు ఎలాంటి వసతి కల్పించాల్సిన అవసరం లేదు. కానీ మండలం మొత్తం మీద ప్రత్యక్ష ఓట్లతో గెలిచిన తమకు మండల ఆఫీసుల్లో చాంబర్ ​ఎందుకు కేటాయించరని జడ్పీటీసీలు ప్రశ్నిస్తున్నారు. 500, 600 మెజార్టీతో ఒక్క ఊరిలో ఎంపీటీసీలుగా గెలిచి ఎంపీపీలు అయిన వారికి ప్రత్యేక హోదా కల్పిస్తుంటే.. తమకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వరని జడ్పీటీసీలు  ఫైట్ చేస్తున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం విధులు, బాధ్యతల విషయంలో మండలంలో ఎంపీపీలకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు.  
ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుంటేనే.. 
పెద్దవూర మండలంలో జడ్పీటీసీకి చాంబర్​ ఏర్పాటును అక్కడి ఎంపీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నల్గొండలో జరిగిన జడ్పీ మీటింగ్​లో పెద్దవూర ఎంపీపీకి పలువురు సభ్యులు మద్దతు తెలిపారు. జడ్పీటీసీలతో వాగ్వాదానికి దిగారు.  ఎమ్మెల్యేలు, ఎంపీలు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. దీంతో జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి జోక్యం చేసుకుని మంత్రి అనుమతి మేరకే పెద్దవూరలో జడ్పీటీసీకి రూమ్ కేటాయించామని, అంతకు మించి సభలో వివరించి చెప్పలేనని చెప్పారు. మంత్రి, ఎమ్మెల్యేలు రాజకీయ లబ్ధి కోసం ఎంపీపీలు, జడ్పీటీసీల మధ్య చిచ్చుపెట్టారని, తీవ్రరూపం దాల్చకముందే ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నల్గొండ నియోజకవర్గంలోని తిప్పర్తి మండలంలో సీన్​ మరోలా ఉంది. ఇక్కడ ప్రస్తుత జడ్పీటీసీ గతంలో ఎంపీపీగా పని చేశారు. కానీ అప్పుడు ఎంపీపీ ఆఫీసులో జడ్పీటీసీ చాంబర్ లేదు. కానీ ఇప్పుడు అదే ఎంపీపీ జడ్పీటీసీగా ఉన్నారు. కానీ ఆయనకు మండల ఆఫీసులో ఇప్పుడు ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేశారు. ఇదే నియోజకవర్గంలోని కనగల్ మండలంలో జడ్పీటీసీకి చాంబర్ లేదు. ఎంపీపీ ఆఫీసులో రూమ్ ఇవ్వాలని ఆయన కోరారు. అందుకు వీలుపడకపోవడంతో ఏఎమ్మార్పీ క్వార్టర్స్​లో ఏర్పాటు చేసుకునేందుకు అనధికారికంగా పర్మిషన్ ఇచ్చారు. కానీ ఆ క్వార్టర్స్ రిపేరు చేయడానికే ఐదారు లక్షలు ఖర్చయ్యేలా ఉందని వద్దనుకున్నారు.