మైనర్ పై ఆత్యాచారం.. వీడియో నెట్ లో పెడతానంటూ బెదిరింపు

మైనర్ పై ఆత్యాచారం.. వీడియో నెట్ లో పెడతానంటూ బెదిరింపు

ఎల్ బీ నగర్,వెలుగు:  మైనర్ బాలికను ఓ యువకుడు బెదిరించి తీసుకెళ్లి  అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎల్ బీ నగర్ పీఎస్ పరిధిలో జరిగింది. నల్లొండ త్రిపురారంకి చెందిన భార్యభర్తలు సిటీకి వచ్చి ఎల్ బీనగర్ సమీపంలో ఓ చిన్న హోటల్ నడుపుకుంటున్నారు. వీరి కూతురు(13) దగ్గరలోని ఓ ప్రైవేటు స్కూల్ 8వ తరగతి చదువుతోంది. వీరి ఇంటిపైనే నాగర్ కర్నూల్ జిల్లా అమ్రబాద్ మండలం లక్ష్మాపురానికి చెందిన ముదావత్ శ్రీను(25) ఉంటున్నాడు. శ్రీను మైనర్ బాలికకు మాటలు చెప్పి స్నేహం పెంచుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత ప్రేమిస్తున్నానని..పెళ్లిచేసుకుంటానని ఆ బాలికను వేధించడం మొదలుపెట్టాడు. ఓ రోజు శ్రీను ఆ బాలికను బలవంతంగా రూమ్ లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అదే సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. తాను చెప్పినట్టు వినకపోతే ఆ ఫొటోలను ఇంటర్నెట్ లో పెడతానని ఆ బాలికను శ్రీను బెదిరించాడు.

దీంతో ఈ విషయాన్ని ఆ అమ్మాయి ఇంట్లో వారితో చెప్పలేదు. మరో సారి శ్రీను ఆ బాలికను ఫొటోల పేరుతో బెదిరించి సరూర్ నగర్ పార్క్ కి తీసుకెళ్లి అక్కడ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ బాలిక పార్క్ లో శ్రీను అసభ్యంగా ప్రవర్తించాడని తన అన్నతో చెప్పింది.  గతంలో జరిగిన ఘటన గురించి చెప్పలేదు. ఆ బాలిక అన్న..శ్రీనుకి వార్నింగ్ ఇచ్చాడు. సోమవారం రాత్రి ఆ బాలిక తన ఫ్రెండ్ తో కలిసి ఇంటికి వెళ్తోంది. ఈ సమయంలో శ్రీను తన ఫ్రెండ్ సాగర్ తో కలిసి కారులో వచ్చి ఆ బాలికను బెదిరించి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతడి ఫ్రెండ్ సాగర్ వీడియో తీశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను ఇంటర్నెట్ లో పెడతామని శ్రీను, సాగర్ ఆ బాలికను బెదిరించి..ఇంటి దగ్గర వదిలివెళ్లారు.  గతంలో జరిగిన వాటితో పాటు ప్రస్తుతం జరిగిన ఘటనను ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లి ఇచ్చిన కంప్లయింట్ తో శ్రీను, సాగర్ పై నిర్భయ చట్టం కింద ఎల్ బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు శ్రీను అదుపులోకి తీసుకున్నారు. సాగర్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.