గురుకులాలకు సరకులను సకాలంలో సప్లయ్ చేయండి : షఫీయుల్లా

గురుకులాలకు సరకులను సకాలంలో సప్లయ్ చేయండి : షఫీయుల్లా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో నిత్యావసర వస్తువుల సేకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను మైనారిటీ గురుకుల సెక్రటరీ షఫీయుల్లా ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియెట్‌‌‌‌లో ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి, బీసీ గురుకుల సెక్రటరీ సైదులు, ఎస్టీ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మితో కలిసి షఫీయుల్లా ప్రొక్యూర్మెంట్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. సంక్షేమ గురుకులాలు, వసతిగృహాల్లో అవసరమైన నిత్యావసర సరకుల సేకరణపై చర్చించారు. 

నాణ్యమైన నిత్యావసర వస్తువులను స్థానిక ధరలకు అనుగుణంగా, సకాలంలో సరఫరా చేసేలా చూడాలని షఫీయుల్లా సూచించారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌‌‌‌గా ఉన్న డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ ఆధ్వర్యంలో టెండర్ ప్రాసెస్ పారదర్శకంగా, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గురుకులాలు, హాస్టళ్లలో నిత్యావసరాల పంపిణీలో లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని షఫీయుల్లా అధికారులకు స్పష్టం చేశారు.