టాక్స్ దొంగల్ని పట్టేస్తాం: CBDTచైర్మన్​

టాక్స్ దొంగల్ని పట్టేస్తాం: CBDTచైర్మన్​

న్యూఢిల్లీ : ఇన్‌‌కంటాక్స్‌‌ డిపార్ట్‌‌మెంట్ వ్యక్తుల సోషల్‌‌ మీడియా పోస్టులను చూస్తోందనేది అపోహేనని సెంట్రల్‌‌ బోర్డ్‌‌ ఆఫ్‌‌ డైరెక్ట్‌‌ టాక్సెస్‌‌ (సీబీడీటీ) స్పష్టం చేసింది. విలాసవంతమైన విదేశీ టూర్లు, ఖరీదైన వస్తువుల కొనుగోలును కనిపెట్టేందుకు సోషల్‌‌ మీడియా పోస్టుల్లోంచి తొంగి చూస్తోందనేది అవాస్తవమని పేర్కొంది. వ్యక్తుల ఆదాయాలు తెలుసుకోవాలంటే రకరకాల ఏజన్సీల నుంచి ఇన్ఫర్మేషన్‌‌, డేటా అడిగి తీసుకునే అధికారం ఇన్‌‌కంటాక్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు ఉందని, సోషల్‌‌ మీడియా పోస్టుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని సీబీడీటీ ఛైర్మన్‌‌ పీ సీ మోడి వెల్లడించారు. అందుబాటులోకి వచ్చిన ఇన్ఫర్మేషన్‌‌, డేటా నుంచి హైవాల్యూ ట్రాన్సాక్షన్స్‌‌ను కనుక్కోవడానికి డిపార్ట్‌‌మెంట్‌‌ దగ్గర శక్తివంతమైన డేటా అనలిటిక్స్‌‌ టూల్స్‌‌ ఉన్నాయని తెలిపారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోడి ఈ విషయాలు చెప్పారు.

ఫేస్‌‌బుక్‌‌, ట్విట్టర్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌తోపాటు ఇతర సోషల్‌‌ మీడియా ఎకౌంట్ల ద్వారా వ్యక్తుల ఆదాయం, ఖర్చు చేసే పద్ధతుల గురించి  సమాచారాన్ని  రహస్యంగా ఐటీ డిపార్ట్‌‌మెంట్‌‌ తెలుసుకుంటోందా అనే ప్రశ్నకు పై విధంగా సమాధానం  ఇచ్చారు. సోషల్‌‌ మీడియా పోస్టుల్లోకి  ఐటీ డిపార్ట్‌‌మెంట్‌‌ తొంగి చూస్తోందంటూ గతంలో వార్తా కథనాలు వచ్చాయి. విలాసవంతమైన విదేశీ ట్రిప్పులు, ఖరీదైన తమ కార్లను, ఇతర వస్తువులను ప్రదర్శిస్తూ పెట్టే పోస్టులను ఐటీ డిపార్ట్‌‌మెంట్‌‌ పరిశీలిస్తోందని ఆ కథనాలు వెల్లడించాయి. అలా పోస్టులు పెట్టేవాళ్లు పన్నులు సక్రమంగా కడుతున్నారో లేదో తెలుసుకోవాలనేదే ఐటీ డిపార్ట్‌‌మెంట్‌‌ లక్ష్యంగా పేర్కొన్నాయి. ఇదంతా అపోహేనని మోడి కొట్టిపారేశారు. సోషల్‌‌ మీడియా పోస్టులలోకి తొంగి చూడాల్సిన ఆవశ్యకత మాకేమి ఉందని మోడి ప్రశ్నించారు. విదేశీ టూర్ల వివరాలు, ఇతర ఆర్థిక ట్రాన్సాక్షన్స్‌‌ గురించిన సమాచారం మాకు నిఖార్సైన మార్గంలోనే దొరుకుతుందని ఆయన చెప్పారు. ఐటీ డిపార్ట్‌‌మెంట్‌‌కు సంబంధించిన విధి, విధానాలను సీబీడీటీ ఖరారు చేస్తుంది.

అత్యాధునికమైన డేటా ఎనలిటిక్‌‌ టూల్స్‌‌ను ఐటీ డిపార్ట్‌‌మెంట్‌‌ సమకూర్చుకుంది. వాటి ద్వారా ఇన్ఫర్మేషన్‌‌, డేటాను విశ్లేషించి, ఏ రంగాలపై పన్ను విధించాలి, ఏ రంగాలకు రాయితీలివ్వాలనేది డిపార్ట్‌‌మెంట్‌‌ నిర్ణయిస్తుందని మోడి తెలిపారు. ఈ కొత్త విధానానికి ‘ప్రాజెక్ట్‌‌ ఇన్‌‌సైట్‌‌’గా పేరు పెట్టారన్నారు. వ్యక్తులు లేదా సంస్థలకు చెందిన సంపూర్ణ సమాచారాన్ని (360 డిగ్రీల ప్రొఫైలింగ్‌‌) ఈ విధానం ద్వారా క్రోడికరించొచ్చని చెప్పారు. వారి లావాదేవీల మూలాలనూ తెలుసుకోగలుగుతామని వెల్లడించారు. ప్రాజెక్ట్‌‌ ఇన్‌‌సైట్‌‌ ద్వారా వచ్చే సమాచారం సాయంతో, ఒక పరిమితికి మించి లావాదేవీలు నిర్వహించే వ్యక్తులకు డిపార్ట్‌‌మెంట్‌‌ ఎస్‌‌ఎంఎస్‌‌లు పంపించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 18 రకాల ట్రాన్సాక్షన్స్‌‌ను ఎంపిక చేసినట్లు చెప్పారు.  పన్ను వసూలుదారు, పన్ను చెల్లింపుదారుల మధ్య ఫ్రెండ్లీ వాతావరణం నెలకొల్పేందుకే ఈ చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు.  మీరు ఫలానా, ఫలానా ట్రాన్సాక్షన్స్‌‌ నిర్వహించారు. వాటిని ఇన్‌‌కంటాక్స్‌‌ రిటర్న్‌‌లో వెల్లడించమని, అవసరమైతే పన్నులు చెల్లించమని చెప్పడమే ఈ మెసేజ్‌‌ల ఉద్దేశమని అన్నారు. కొన్ని విభాగాలలోని పన్ను చెల్లింపుదారుల కోసం ప్రీ ఫిల్డ్‌‌ ఐటీఆర్‌‌లను తాజాగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

ఎలాంటి ఇబ్బందులూ లేని విధంగా ఆ ప్రీ ఫిల్డ్‌‌ ఐటీఆర్‌‌లను తీర్చిదిద్దాలనేదే లక్ష్యమని చెప్పారు. పన్ను చెల్లింపుదారులకే డిపార్ట్‌‌మెంటే అకౌంటెంట్‌‌గా పనిచేస్తోందని అన్నారు. వారు నిర్వహించిన ట్రాన్సాక్షన్స్‌‌ వివరాలతో అకౌంట్‌‌ను అందచేస్తున్నట్లు చెప్పారు. బ్యాంకులు, మ్యూచువల్‌‌ ఫండ్స్‌‌, క్రెడిట్‌‌ కార్డు కంపెనీలు, సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ల నుంచి ఈ వివరాలను డిపార్ట్‌‌మెంట్‌‌ సేకరిస్తున్నట్లు తెలిపారు. ఐతే, ప్రీఫిల్డ్‌‌ ఐటీఆర్‌‌ ఫైల్‌‌ చేసే ముందు సమాచారాన్ని ఒకసారి సరి చూసుకోమని పన్ను చెల్లింపుదారులకు ఆయన సలహా ఇచ్చారు. ఒక్కోసారి డేటాలో కొన్ని పొరపాట్లు దొర్లే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎక్కువ ఖర్చు పెట్టేవారికి ఇన్‌‌కంటాక్స్‌‌ రిటర్న్‌‌ దాఖలును తాజా బడ్జెట్లో తప్పనిసరి చేశారు. గరిష్టపరిమితి రూ. 5 లక్షల లోపు ఉండి, టాక్సబుల్‌‌ ఆదాయం లేకపోయినా, ఖర్చు ఎక్కువ పెట్టే వాళ్లు రిటర్న్‌‌ ఫైల్‌‌ చేయాల్సిందేనని బడ్జెట్‌‌ స్పష్టం చేసింది.

విదేశీ టూర్లకు రూ. 2 లక్షలకు మించి వెచ్చించే వారు, బ్యాంకు అకౌంట్లో ఒక ఏడాదిలో రూ. కోటికి మించి డిపాజిట్ చేసే వారు, సంవత్సరానికి రూ. 1 లక్షకు మించి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టేవారు, రిటర్న్‌‌లు తప్పనిసరిగా ఫైల్‌‌ చేయాలని నిర్దేశించారు. ఎక్కువ ఖర్చు పెడుతున్నప్పటికీ ఐటీఆర్‌‌లు ఫైల్‌‌ చేయడం లేదనే అంశాన్ని ఎనలిటిక్స్‌‌ ద్వారా గుర్తించే తాజా మార్పులు తీసుకొచ్చినట్లు మోడి వెల్లడించారు. ఇంతింత మొత్తాలను ఖర్చు చేస్తుంటే, వారి ఆదాయాలపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదా ? అని ప్రశ్నించారు. పన్ను చెల్లింపు అలవాటును పెంచాలనేదే ఉద్దేశమని, నిజాయితీగా పన్నులు చెల్లించే వారిని గౌరవించాలనేదే ఆలోచనని పేర్కొన్నారు. పన్ను ఎగవేసే వ్యక్తులు చట్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పన్ను చెల్లింపుదారులు, అసెస్‌‌మెంట్ ఆఫీసర్లు కలవనవసరం లేని విధానాన్ని (ఫేస్‌‌లెస్‌‌ అసెస్‌‌మెంట్‌‌) తెచ్చే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిపారు. టాక్స్‌‌ ప్రొసీడింగ్స్‌‌ అన్నీ ఆన్‌‌లైన్‌‌లోనే జరిగేలా చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఫేస్‌‌లెస్‌‌ అసెస్‌‌మెంట్‌‌ ప్రవేశపెట్టడానికి అవసరమైన ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చిందన్నారు. కొద్దిగా తుది మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉందని మోడి చెప్పారు.