
- బుద్ధవనం, విజయవిహార్ను సందర్శించనున్న మిస్ వరల్డ్–2025 పోటీల కంటెస్టెంట్స్
- విజయవిహార్‌లో ఫొటో సెషన్
- బుద్ధపూర్ణిమ సందర్భంగా
- బుద్ధ విగ్రహానికి పుష్పాంజలి
- బౌద్ధ భిక్షువులతో కలిసి ధ్యానం
- రేపు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్
హైదరాబాద్/హాలియా, వెలుగు: మిస్‌వరల్డ్– 2025 పోటీల కోసం హైదరాబాద్‌కు వచ్చిన అందాల భామలు సోమవారం నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ కు వెళ్లనున్నారు. కంటెస్టెంట్స్ ను బృందాలుగా చేసి రాష్ట్రంలోని ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాలకు ప్రభుత్వం తీసుకెళ్తున్నది. ఇందులో భాగంగా మొదటిరోజు అందాల భామలు బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని, ఇక్కడ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఆసియా దేశాల నుంచి పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వారిలో 24 మందితో కూడిన బృందం నాగార్జునసాగర్ ను సందర్శించనున్నది. ఈ బృందం హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు చింతపల్లి సమీపంలోని వెల్లెంకి గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి నాగార్జునసాగర్ లోని విజయవిహార్ కు వెళ్తుంది.
అక్కడ ముస్తాబయిన తర్వాత వాటర్ బ్యాక్‌గ్రౌండ్, మెయిన్ ఎంట్రెన్స్ ప్రదేశాల్లో ఫొటో సెషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి బుద్ధవనం చేరుకుంటారు. బుద్ధ చరిత వనంలోని అసెంబ్లీ ప్రదేశానికి వీరికి సంప్రదాయ నృత్యంతో ఘనస్వాగతం పలుకుతారు. అనంతరం వారు మహాస్తూపం వద్దకు చేరుకుంటారు. బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటిస్తారు.
బౌద్ధ భిక్షువులతో కలిసి ధ్యానం
మహాస్తూపం ముందు భాగంలో టూరిజం శాఖ ఏర్పాటు చేసిన సాంప్రదాయ నృత్యాలను అందాల భామలు వీక్షిస్తారు. ఈ ప్రదేశంలోనే అనుమతి ఉన్న మీడియా వారు ఫొటోలు తీసుకుంటారు. అటుపై మహాస్తూపం చేరుకొని ఆ స్తూపంపై ఉన్న బౌద్ధ శిల్పాలను సందర్శిస్తారు. మహాస్తూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో బౌద్ధ భిక్షులతో కలిసి ధ్యానం, చాంటింగ్లో పాల్గొంటారు.
ధ్యాన మందిరంలో కొద్దిసేపు గడిపిన తర్వాత మహాస్తూపం వెనుక భాగంలోని జాతక వనంలో ఏర్పాటు చేసిన లేజర్ లైటింగ్ షో, స్క్రీన్ పై నిర్వహించే డాక్యుమెంటరీని వీక్షిస్తారు. ఇక్కడ రాత్రి భోజనం చేసిన అనంతరం తిరిగి హైదరాబాద్ కు తిరుగుపయనం అవుతారు. ఇందుకోసం విజయ్ విహార్ ను అన్ని హంగులతో తీర్చిదిద్దారు. రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.
2 వేల మంది సిబ్బందితో బందోబస్తు: ఎస్పీ శరత్ పవార్
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా కంటెస్టెంట్స్ వస్తుండటంతో నాగార్జున సాగర్ లో 2 వేల మంది సిబ్బందితో పోలీస్ శాఖ పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ పవార్ తెలిపారు. ఆదివారం నాగార్జున సాగర్‌లో బందోబస్తుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
భద్రతా చర్యల్లో భాగంగా బాంబు, డాగ్ స్క్వాడ్, ఏరియా డామినేషన్ బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. బుద్ధవనం పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు, బెలూన్లు ఎగరేయడం, క్రాకర్స్కాల్చడాన్ని నిషేధించారు.
రేపు చార్మినార్‌వద్ద హెరిటేజ్ వాక్
తెలంగాణ వారసత్వం, ఘనమైన చరిత్ర, సంస్కృతిని తెలిపేలా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌ను రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం అందాల భామలు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నారు. చార్మినార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్ కొనసాగుతుంది. ఈ క్రమంలో చార్మినార్ వద్ద ప్రసిద్ధిగాంచిన మట్టి గాజులు, పెరల్స్ షాపింగ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి షాపులను, చార్మినార్ పరిసర ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దారు.
చౌమహల్లా ప్యాలెస్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిన్నర్ ప్లాన్ చేశారు. ఇందులో 38 రకాల తెలంగాణ సాంప్రదాయ వంటకాలను సిద్ధం చేస్తున్నారు. కాంటినెంటల్ వెరైటీలకు కూడా హైదరాబాద్ వేదిక అనేలా వివిధ ప్రాంతాల ఫేమస్ఫుడ్స్ను పరిచయం చేయనున్నారు. అదేవిధంగా ఇక్కడ ట్రెడిషినల్ షో కూడా ఏర్పాటు చేస్తున్నారు.
నీరాకు ఫిదా
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కంటెస్టెంట్లు నీరా రుచి చేశారు. కొందరు అందాల భామలు నీరా తాగుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తాటి ముంజలతోపాటు వారు నీరా రుచికి ఫిదా అయ్యారు.