మే 13న చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్

మే 13న చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్
  • పాతబస్తీని సందర్శించనున్న మిస్​ వరల్డ్​ కంటెస్టెంట్స్​
  • వెల్లడించిన ఐఅండ్​పీ ఆర్​ శాఖ స్పెషల్​ కమిషనర్​ వినయ్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: మిస్ వరల్డ్-–2025 పోటీలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ టీ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 13న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పాత బస్తీని సందర్శించి, చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారని తెలిపారు.  బుధవారం ఓల్డ్ సిటీలోని చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్​ను పర్యాటక శాఖ డైరెక్టర్ జెడ్ హనుమంత్  కొండిబా, సౌత్ జోన్ డీసీపీ  స్నేహ మెహ్రతో కలసి సందర్శించారు. ఏర్పాట్లపై  అధికారులకు దిశానిర్దేశం చేశారు. వినయ్​ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘మే 10 నుంచి 31వ తేదీ వరకు మిస్ వరల్డ్  పోటీలు జరుగనున్నాయి. 

చార్మినార్ వద్ద వాక్​తోపాటు లాడ్ బజార్, చౌమహల్ల ప్యాలెస్ ను మిస్​ వరల్డ్​ కంటెస్టెంట్స్​ సందర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 116 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పోటీదారులతోపాటు దేశ విదేశాల నుంచి ఈవెంట్ కవరేజ్​కు దాదాపు 3 వేల మంది మీడియా ప్రతినిధులు హాజరవుతారు. అలాగే వివిధ దేశాల నుంచి పోటీలకు వచ్చే వారిని తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలతో స్వాగతించాలని, పోటీలు పూర్తయ్యేంత వరకు ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా ఏర్పాట్లు  చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటరమణ, పర్యాటక శాఖ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.