హైదరాబాద్: సొంత చెల్లెనే మోసం చేసిన వ్యక్తి కేటీఆర్ అని మంత్రి సీతక్క విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు పోయి సిగ్గు లేకుండా మాట్లాడొద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంటి ఆల్లుడు ఫోన్నే ట్యాపింగ్ చేశారని కేసీఆర్ బిడ్డా కవిత ఆరోపిస్తుంది.. బీఆర్ఎస్ నేతలు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం (జనవరి 24) సీతక్క మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజల గోసను అర్ధం చేసుకొని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 24 గంటలోనే మహిళలకు ఫ్రీబస్ ఏర్పాటు చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం తప్పా బీఆర్ఎస్ నాయకులకు ఇంకో పని లేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చురకలంటించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. పదేండ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు పదువులు శాశ్వతం కాదు.. పనులు శ్వాశతమన్నారు. మేడారంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సమ్మక్క సారక్క తల్లులు చూసుకుంటారని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.
